AP minister Perni Nani says What's wrong in accepting giftsబాధ్యతాయుతమైన పదవిలో ఉండే వారికి సమాజం పట్ల మరింత బాధ్యత ఉంటుంది. ఒక్కోసారి వారి మాటలు సమాజానికి మరింత చేటు చేస్తాయి. సరిగ్గా మంత్రి పేర్ని నాని అటువంటి తప్పే చేశారు. శనివారం ఏపీ జేఏసీ అమరావతి త్రితీయ కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ఆయన చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

“పని చేస్తే… ఎవరైనా సంతోషంగా ఇస్తే… అది గిఫ్ట్ అవుతుంది. అలా ఎవరైనా ఇస్తే సంతోషంగా తీసుకోవచ్చు. పీక మీద కత్తి పెట్టి తీసుకుంటే అది దారి దోపిడీ. నా వద్దకు వచ్చిన ఉద్యోగులకు ఇదే చెప్తా,” అని మంత్రిగా చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ అధికారుల సమక్షంలో చెప్పడం విమర్శలకు దారి తీస్తుంది. లంచమైనా, గిఫ్టుగా ఇచ్చినా అది తప్పే.

ఇప్పుడు లంచం వద్దు గిఫ్టులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే? అవినీతి నిరోధక శాఖ వారు పట్టుకున్నప్పుడు మేము మంత్రిగారు చెప్పినట్టు గిఫ్టులు మాత్రమే తీసుకున్నాం అని బుకాయిస్తే? అప్పుడు మంత్రిగారు ఏమని సంజాయిషీ ఇచ్చుకోగలరు? ఈ వ్యాఖ్యలకు సవరించుకుంటే మంచిది.

ఇది ఇలా ఉండగా మంత్రిగారు ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి చాలా చేస్తున్నారని, వారిని ఒత్తిడికి గురి చెయ్యడం లేదని, ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలని చెప్పడం గమనార్హం. అలాగే సీపీఎస్‌ రద్దుకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడని అన్నారు. విపరీతమైన ఆర్థిక బాధలు ప్రభుత్వానికి ఉన్నాయని, అందుకే ఆలస్యం అవుతుందన్నారు.