YSRCP Minister Roja Selvamaniఏపీ పర్యాక శాఖ మంత్రి ఆర్‌కె. రోజా భర్త సెల్వమణి, తమిళ సినిమాల షూటింగ్ ఏపీలో, హైదరాబాద్‌లో చేయొద్దంటూ కోలీవుడ్‌కి చేసిన తాజా సూచన ఆమెకు తలనొప్పిగా మారింది.

దీనిపై వస్తున్న విమర్శలపై మంత్రి రోజా స్పందిస్తూ, “ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) అధ్యక్షుడైన నా భర్త చెప్పిన విషయాన్ని టిడిపి నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో ఛార్మినార్, గోల్కొండ వంటి కట్టడాలు తమ సినిమా కధకు అవసరమనుకొంటే తప్పకుండా వెళ్ళితీయవచ్చు కానీ కేవలం రోడ్లు, బిల్డింగులు చూపడం కోసమే అయితే అక్కడికి ఎందుకు వెళ్ళడం?అవి ఇక్కడ తమిళనాడులోనే ఉన్నాయి కదా?

తమిళనాడులో తీయవలసిన సినిమాలను ఏపీ, హైదరాబాద్‌లో తీస్తున్నట్లయితే కోలీవుడ్ పరిశ్రమలో పనిచేస్తున్నవారికి పని దొరకదు. పైగా తమిళనాడుకు దక్కవలసిన జీఎస్టీ ఆదాయం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతుంది కదా?అనే సదుద్దేశ్యంతోనే నా భర్త ఆ మాట అన్నారు తప్ప ఏపీలో షూటింగ్స్ చేయవద్దని చెప్పలేదు.

అయినా మొన్న చిరంజీవి బృందానికి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలని, సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలిరావాలని కోరారు. కానీ ఎవరూ స్పందించలేదు. తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది నటులు, నిర్మాతలు ఉన్నారు కదా?ఆ పార్టీకి ఏపీ మీద అంతగా ప్రేముంటే వాళ్ళకు ఏపీలో సినిమాలు తీయాలని గట్టిగా చెపొచ్చు కదా?

వాళ్ళకి ఏపీ నుంచి వచ్చే ఆదాయం కావాలి కానీ ఏపీ అక్కరలేదు. అయినా చంద్రబాబు నాయుడుతో సహా ఎవరూ ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. టిడిపి నేతలకి ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలని గానీ, రాష్ట్రమంటే గౌరవం గానీ లేవు…” అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేసారు.

తన భర్త సెల్వమణి ఏపీలో షూటింగ్‌లు పెట్టుకోవద్దని స్పష్టంగా చెపుతునప్పుడు, పర్యాటక మంత్రిగా ఉన్న రోజా ఆ మాటలను ఖండించకపోగా రోడ్లు, బిల్డింగులను చూపించడం కోసమే అయితే ఇక్కడికి రావలసిన అవసరం లేదన్నట్లు మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. అలాంటప్పుడు సినిమా షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్ళడం కూడా అనవసరమే కదా? అక్కడా ఇవే రోడ్లు, బిల్డింగులే కదా ఉంటాయి? అయినా తన భర్తే ఏపీలో సినిమా షూటింగ్స్ చేయవద్దని చెపుతుంటే మద్యలో టిడిపిని నిందించడం ఎందుకు?

ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గానికి కూతవేటు దూరంలోనే తిరుపతి జిల్లాలో నారావారిపల్లి అని ఒకటుందని దానిలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఎప్పటి నుంచో పెద్ద ఇల్లు ఉందనే విషయం మంత్రి రోజాకు తెలియదా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి వద్ద చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసాన్ని కూల్చివేయాలని ప్రయత్నించలేదా?ఈవిదంగా ప్రతిపక్షాలనే కాకుండా సినిమా ఇండస్ట్రీని కూడా రాజకీయరంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటుంటే ఏపీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ రమ్మంటే ఎందుకు వస్తుంది?