YSRCP-Kottu-Satyanarayanaఏపీ రాజధాని కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్, అమరావతిలోనే రాష్ట్ర హైకోర్టు ఉంటుందని చెప్పారు. కానీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “న్యాయస్థానాలలో వాదనలు జరుగుతున్నప్పుడు న్యాయవాదులు సందర్భానుసారంగా ఏదో చెపుతుంటారు. అలాగే అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పి ఉండవచ్చు. బహుశః అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కోర్టులో న్యాయవాదులు ఏదో చెపితే దానికి ప్రభుత్వం కట్టుబడలేదు కదా?ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుంది. మా ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకి కట్టుబడి ఉంది. అక్కడ హైకోర్టు పెట్టాలా మరోటి పెట్టాలా? అనేది మేము ఆలోచించి నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.

మూడు రాజధానులకి టిడిపి, జనసేనలు అడ్డుపడుతున్నాయని ఇంతకాలం వైసీపీ నేతలు వాదిస్తున్నారు. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుని అడ్డుకొంటే సహించబోమంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల తిరుపతిలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. కానీ ఈ విషయంలో వారికే స్పష్టత, చిత్తశుద్ధి లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ మాటలతో స్పష్టం అవుతోంది.

సుప్రీంకోర్టులో న్యాయవాదులు సందర్భోచితంగా ఏదో చెపుతుంటారు దానిని పట్టించుకోనక్కరలేదని మంత్రి చెప్పడం అంటే సుప్రీంకోర్టుని ఉద్దేశ్యపూర్వకంగా తప్పు దోవపట్టిస్తున్నామనట్లే కదా? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలా లేదా మరోటి ఏర్పాటు చేయాలా?అని ఇంకా ఆలోచిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పడం అంటే రాయలసీమ ప్రజలను కూడా మభ్యపెడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికలలో తమకి అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ అడుగుపెట్టడానికి వీలులేదని వైసీపీ నేతల వాదనలకు అర్దం అదే కదా?