YSRCP-Minister Botsa-Satyanarayanaఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. మూడున్నరేళ్ళ తర్వాత నేటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి కూడా. ఇక సచివాలయ ఉద్యోగుల కష్టాలు మరో రకంగా ఉంటాయి. అటు వైసీపీ నేతలకి, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక మద్యన నలిగిపోతుంటారు. నిన్న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్లు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి సచివాలయ ఉద్యోగులతో సమావేశమైనప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“మా ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎటువతి వ్యతిరేకత లేదు. ఏ సమస్యనైనా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి మేము ఎప్పుడూ సిద్దంగానే ఉంటాము. సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రూల్స్, ఇంకా పలు సమస్యల గురించి మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అన్నిటినీ పరిష్కరిచేందుకు ప్రయత్నిస్తాము. కనుక సచివాలయ ఉద్యోగులకు కాస్త ఓపిక అవసరం. సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గం కాదు. అవసరమైతే కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొనైనా పరిష్కరించుకోగల నేర్పు, లౌక్యం కూడా అవసరం,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

పార్టీలో టికెట్ల కోసం, తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే మంత్రి పదవుల కోసం అవి రాకపోతే వేరే పదవుల కోసం పార్టీ నేతలు తమ అధినేతల కాళ్ళు పట్టుకోవడం సహజమే. కానీ ఉద్యోగులు మంత్రుల కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఏమిటి? వైసీపీ ప్రభుత్వమే త్రిశంఖు స్వర్గంలాంటి సచివాలయ వ్యవస్థను, దానికి అనుబందంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించింది. ఆ రెండు వ్యవస్థలను ప్రధానంగా వైసీపీ రాజకీయ అవసరాల కోసమే ప్రధానంగా వాడుకొంటోంది. వైసీపీ నేతలు వారిని ఇష్టం వచ్చిన్నట్లు వాడుకొంటున్నారు. ఇంకా తమ కాళ్ళు కూడా పట్టుకోవాలన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం దురహంకారం అనుకోక తప్పదు. సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడినా, సరిగ్గా పనిచేయకపోయినా వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణే చెపుతున్నప్పుడు, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా?కానీ సచివాలయ ఉద్యోగులు తమ కాళ్ళు పట్టుకోవాలని సూచించడం ఏమిటి?