YSRCP leaders quarrel during gadapa gadapa ki ycpఈ నెల 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ‘గడపగడపకి వైసీపీ’ కార్యక్రమం మొదలవబోతోంది. దీనిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్ళి తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి, వచ్చే ఎన్నికలలో తమ పార్టీకే మళ్ళీ ఓట్లు వేయాలని అభ్యర్ధించబోతున్నారు.

కనుక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిలో వైసీపీ నేతలు సమావేశమయ్యి ‘గడపగడపకి వైసీపీ’ కార్యక్రమం నిర్వహణపై చర్చించుకొంటున్నారు.

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో వైసీపీ నేతలు కూడా గురువారం ఉదయం స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో చేరి దీనిపై చర్చించుకొంటుండగా ఓ అనూహ్య పరిణామం జరిగింది.

“ఈ కార్యక్రమం కోసం నేను రూ.10 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నానని” పార్టీ పట్టణ అధ్యక్షులు కేశవరెడ్డి చెప్పడంతో ఆయన అనుచరులు చప్పట్లు కొట్టి అభినందించారు. కానీ ఆ సమావేశంలో పాల్గొన్న సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు, రూరల్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు మారెన్న “ఆ… నీకేంటి ఇసుక తోలి బాగానే దోచుకొన్నావు కదా ఎంతైనా ఖర్చు పెడతావు…” అని అనడంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

దీంతో వారిరువురూ పరస్పరం వాదోపవాదాలు చేసుకొంటూ పరస్పరం నిందించుకొన్నారు. మిగిలినవారు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ ఆవేశంలో ఇద్దరూ పార్టీ కార్యాలయం బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి పరస్పరం నిందించుకోవడంతో ఊరులో జనాలు కూయా అక్కడ పోగయీ వారి భాగోతం కనులారా తిలకించారు. దీంతో పార్టీ పరువు బజారున పడినట్లయింది.

తమ పార్టీ నేత ఇసుక దొంగ అని నడిరోడ్డు మీద నిలబడి వైసీపీ నేతలే చెప్పుకొంటుంటే ఇక వారు ‘గడపగడపకి వైసీపీ’ అంటూ ఏ మోహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళగలరు?