YSR-Congress-Party Leaders Loose Tongueఏదైనా ఒక రాజకీయ పార్టీలో ముఖ్యనేతలు పక్క చూపులు చూడకుండా ఉంచేందుకు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులో లేదా నియోజకవర్గం అభివృద్ధిపేరిట కాంట్రాక్టులో కట్టబెడుతుంటాయి అధికార పార్టీలు. అయినా కొందరు ఏదో కారణంతో పక్క చూపులు చూస్తుంటారు. అటువంటివారు పార్టీకి చాలా అవసరం అనుకొన్న వారు చేజారిపోకుండా ఉండేందుకు పార్టీలు వారికి ‘కీలక బాధ్యతలు’ అప్పగిస్తుంటాయి. అదే… వారి చేత ప్రతిపక్షాలను రోజూ తిట్టిపోయిస్తుండటం!

ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఆ కీలక బాధ్యతలు నిర్వహించిన మంత్రుల స్థానంలో కొత్తవారు వచ్చి పని మొదలుపెట్టారు. తమ అధినేతను మెప్పించడానికని వారు చాలా రెచ్చిపోయి మాట్లాడే మాటలే వారికి భవిష్యత్‌లో అడ్డుగోడలుగా నిలుస్తాయని వారు గ్రహించేలోగా జరుగకూడని అనర్ధం జరిగిపోతుంది.

అధినేత మెప్పు పొందాలనే తాపత్రయంతో వ్యక్తిగతస్థాయి దూషణలు చేస్తుండటంతో, ఒకవేళ భవిష్యత్‌లో తమ పార్టీ పరిస్థితి తారుమారైతే, వేరే పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు బయటకు వెళ్ళే దారులు మూసుకుపోవడంతో ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతున్నా పార్టీలో కొనసాగవలసి వస్తుంది. బహుశః ఈ ముందుచూపుతోనే ఏపీలోని అధికార పార్టీ మంత్రులను మార్చి పార్టీలో అందరికీ ఈ కీలక బాధ్యతలలో పాలుపంచుకొనే అవకాశం కల్పిస్తున్నట్లుంది.

మరి ఈ విషయం వైసీపీ నేతలు గ్రహించారో లేదో కానీ ప్రస్తుతం మాత్రం తమ అధినేత మెప్పుకోసం పోటీలు పడి మరీ ప్రతిపక్షాలను నిందిస్తూ భవిష్యత్‌లో వాటిలోకి ప్రవేశించే వీలులేకుండా వారే వాటి తలుపులు మూసేసుకొంటున్నారని చెప్పక తప్పదు.