YSRCP-Leaders-Attack-On-TDP-Leader-Chennupati-Gandhiఈ మూడున్నరేళ్ళలో వైసీపీ పాలన ఏవిదంగా సాగుతోందో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడి చేయడం వైసీపీ పాలనలో అరాచకాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ఆ దాడిలో ఆయన కుడికంటికి తీవ్ర గాయమై కంట్లో నుంచి రక్తం కారింది. కంట్లో ఇనుపచువ్వతో పొడిచినట్లు చెన్నుపాటి గాంధీ స్వయంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏ కేసులోనైనా బాధితుడు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేస్తుంటారు. కానీ ఈ దాడిలో బాధితుడు చెన్నుపాటు గాంధీ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌ వైద్యులు చెప్పినది పోలీసులు పరిగణనలోకి తీసుకోవడం విశేషం.

చేతితో కంటి మీద గుద్దడం వలననే చెన్నుపాటి గాంధీ కంట్లో నుంచి రక్తం కారింది తప్ప ఎటువంటి పదునైన ఆయుధాలతో దాడి చేసిన దాఖలాలు లేవని వైద్యులు చెప్పారని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా చెప్పారు.

శనివారం సాయంత్రం 5.30 గంటలకు చెన్నుపాటి గాంధీపై దాడి జరుగగా, టిడిపి నేతలు వెళ్ళి పోలీస్ కమీషనర్‌ను నిలదీస్తే ఆదివారం మధ్యాహ్నం కేసు నమోదు చేశారు. చెన్నుపాటి గాంధీని రక్తం కారేలా కొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తుంటే, ఇరువర్గాల మద్య జరిగిన చిన్న ఘర్షణలో ప్రత్యర్ధులు ఆయనను గాయపరిచారని కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలపై హత్యానేరం సెక్షన్ ఐపీసీ 307 నమోదు చేయవలసి ఉండగా బెదిరించడం, ఆయుధంతో దాడి చేసినట్లు పేర్కొని సెక్షన్స్ 506, 326 కింద కేసు నమోదు చేశారు.

పట్టపగలు టిడిపి రాష్ట్ర కార్యదర్శిపై హత్యాయత్నం జరగడం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి వెంటనే చర్యలు చేపట్టకపోవడం, టిడిపి నేతలు నిలదీసిన తర్వాత హత్యాయత్నాన్ని తక్కువ చేసిచూపుతూ కేసు నమోదు చేయడంపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పోలీస్ శాఖ ఏవిదంగా పనిచేస్తోందో, శాంతి భద్రతల పరిస్థితి ఏవిదంగా ఉందో అర్దం అవుతోందని అన్నారు. టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ హత్యారాజకీయాలకు వెనకడటంలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ చేస్తున్న దుర్మార్గాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఈ మూడున్నరేళ్ళలో ఏపీలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. సంక్షేమ పధకాలు వాటి కోసం చేస్తున్న అప్పులు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఈ హత్యారాజకీయాలు కూడా పెరిగిపోతున్నాయి. అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా, హత్యారాజకీయాలతో బిహార్‌ను తలపిస్తోంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది.