YS JAGAN assemblyఅవినీతి, అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు 13 కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాటలోనే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నట్లుగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏపీని కుదిపేస్తున్న ‘కాల్ మనీ’లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న విషయం తెలిసిందే. అయితే టిడిపి నాయకులు ఉన్నారంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండగా, ప్రతిపక్ష నేతలే ఉన్నారని అధికార పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అయితే విచారణ ప్రాధమిక దశకు చేరుకునే సమయానికి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు ‘కాల్ మనీ’ వ్యాపారం చేసే 118 మందిని అరెస్ట్ చేసారు. వీరందరిలో 83 మందికి రాజకీయ నాయకుల అండ ఉన్నట్లుగా తేలింది. ఇందులో అత్యధికంగా 44 మందికి వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు తేలగా, 20 మందికి టిడిపి, 13 మందికి కాంగ్రెస్, మరో ఆరుగురికి వామపక్ష పార్టీ సభ్యులతో లింక్ లు ఉన్నట్లు సమాచారం. ఇంకా దాడులు కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందంటూ గవర్నర్ కు జగన్ వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, తీరా వాస్తవ రూపానికి వచ్చేసరికి జగన్ పార్టీ వర్గీయులే ముందు వరుసలో ఉన్నారని అధికారులు తేల్చారు. దీంతో డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి జగన్ పార్టీ సభ్యులకు తలెత్తింది. ముఖ్యంగా ఈ రోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ అంశం మరింత రచ్చ రచ్చగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఈ ‘కాల్ మనీ’ అంశంతోనే అధికార పార్టీపై పులిలా గర్చించాలనుకున్న జగన్ వర్గీయుల పరిస్థితి ‘పిల్లి’ మాదిరి తయారయ్యిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Click here to Reply or Forward