YCP Leader Gadikota MPTC caught for Illegal Liquor Sellingకరోనా వైరస్ ని ఎదురుకోవడానికి దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించడంతో మద్యం అమ్మకాలు కూడా ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడంతో అసలు మద్యం దొరకడం అసంభవం అని అనుకున్నారు అంతా. అయితే అందుకు విరుద్ధంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఒక అధికార పార్టీ నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి.

పలుచోట్ల భారీగా మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, సీఐ తిరుపతయ్య నేతృత్వంలో సిబ్బంది గడికోటలో సోదాలు నిర్వహించారు. శ్రీనివాస రెడ్డి అనే ఈ నేత ఇటీవల గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో 1200 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నదానిపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారని, అది ఏపీ మద్యం కాదని ఆ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్నికలలో మద్యం, డబ్బు పంచి పెట్టే నేతలను అరెస్టు చేసి, అనర్హులుగా ప్రకటిస్తామని జగన్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు తీసుకుని వచ్చింది. ఇప్పుడు తమ పార్టీ నేతపై ఎటువంటి చర్య తీసుకుంటారో చూడాలి. ఇది జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి పరీక్ష అనే చెప్పుకోవాలి.