YSRCP Leader behind Ram Gopal Varma Lakshmi's NTRసంచలనాలకు వేదికగా నిలిచే రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ “లక్ష్మీస్ ఎన్టీఆర్” అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా, అది వెనక్కి వెళ్ళడంతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” అన్న నామకరణం చేసి ఇటీవల ‘ఫస్ట్ లుక్’ను కూడా విడుదల చేసి హంగామా చేసారు. ‘వంగవీటి’ అన్న టైటిల్ పెట్టి, ‘దేవినేని’ కుటుంబానికి అనుకూలంగా తీసిన వర్మ, ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఎవరికి అనుకూలంగా తీస్తారో అన్న ఆసక్తి నెలకొన్న నేపధ్యంలో… తాజాగా ఓ ‘అణుబాంబు’ లాంటి వార్తను పేల్చాడు.

“లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను నిర్మించబోయేది వైఎస్సార్సీపీ నేత అయిన పి.రాకేశ్ రెడ్డి అని చెప్తూ… వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. “రాజకీయాలకతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలనేది మా ఇద్దరి అంతరంగిక అభిమతం” అంటూ సినిమా ఉద్దేశాన్ని కూడా చెప్పారు. అయితే ఈ సినిమా వెనుక వైసీపీ నేత ఉన్నారని వర్మ చేసిన ప్రకటన, ఖచ్చితంగా పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలను సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దీంతో మరో రెండు రోజుల పాటు మీడియా వర్గాల్లో వర్మ పేరు ప్రముఖంగా వినిపించడం ఖాయం.

దీంతో రాబోయే కొన్ని రోజులు మీడియా వర్గాలకు వర్మ వాదనలతో పండగే అని చెప్పవచ్చు. గతంలో జరిపిన ఓ చర్చా వేదికలో టిడిపి నేత బాబూ రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్ళు వర్మపై విమర్శలతో చెలరేగగా, తాజాగా ఖరారు చేసిన విషయంతో ఇది మరింత వేడిని రాజుకుని, మరింత సంచలనంగా మారే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. పోలిటిక్స్ కు అతీతంగా సినిమా తీస్తానని వర్మ చెప్పినా… ఎన్టీఆర్ జీవిత చరిత్రను పరిశీలిస్తే… వర్మ చెప్పిన అంశం కార్యరూపంలో సాధ్యం కాదు అన్న విషయం బహిరంగమే.