YSRCP Kuppam Municipalityఅధికారం చేతిలో ఉంటే దానిని ఎలా వినియోగించుకోవచ్చో వైసీపీ సర్కార్ చాటిచెప్తోందన్న మాటలు గత రెండేళ్లుగా ఏపీ రాజకీయాల్లో బలంగా వినపడుతున్నాయి. తాజాగా మరోసారి ‘పవర్’ యొక్క ప్రతిభను కుప్పం వేదికగా ప్రదర్శిస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం చేస్తోన్న విమర్శ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు, ప్రభుత్వ అధికారుల చేత చేయకూడని పనులను వైసీపీ సర్కార్ చేయిస్తోందని, అందుకు అధికారులు కూడా దాసోహం అయ్యారని టిడిపి దుయ్యబడుతోంది.

చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం మునిసిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకుని, బాబు అడ్డాలో పాగా వేయాలనే తలంపుతో వైసీపీ ప్రభుత్వం ఉందనేది సుస్పష్టం. అయితే అది ప్రజాస్వామ్య పద్ధతిగా జరిగినంత కాలం రాజకీయ విమర్శకులకు పెద్దగా పని ఉండదు. కానీ కుప్పంను చేజిక్కించుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుండడం, బెదిరింపులకు పాల్పడుతుండడం, ప్రతిపక్షాలను ప్రచారం చేయనివ్వకుండా చూడటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫార్ములాతో గతంలో పంచాయితీ ఎన్నికలలో కొంతమేర సక్సెస్ కావడంతో, మరొకసారి అదే రూట్ ని ఎంచుకున్నారనేది కుప్పంలో వినిపిస్తోన్న టాక్. టిడిపి అధినేతకు సొంత నియోజకవర్గంలోనే పట్టులేదని రాష్ట్ర వ్యాప్తంగా చాటిచెప్పాలని, తద్వారా టిడిపిని మరింతగా బలహీనపరిచి రాష్టంలో ప్రతిపక్షం లేదన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేస్తోన్న ఈ ప్రయత్నానికి ఈ నెల 15వ తేదీన ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దీని యొక్క ఫలితాలు 17వ తేదీన ప్రకటించబడతాయి.