YSRCP Kadapa MLC Elections VS TDPకడప జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైయస్ ఫ్యామిలీనే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హయాం నుంచి ఆ జిల్లాపై ఆ కుటుంబానిదే ఆధిపత్యం. రాజారెడ్డి మరణం తర్వాత వైఎస్సార్ తన కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగించి ఓ చెరగని ముద్ర వేసారు. అలాగే వైఎస్ తర్వాత సీన్ లోకి వచ్చిన జగన్, క్రమంగా జిల్లాపై పట్టు కోల్పోతున్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.

గత 40 ఏళ్లుగా వైయస్ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి కూడా జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికలో ఇద్దరి వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎన్నికలలో వైసీపీ తరపున బరిలోకి దిగిన విజయమ్మ ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వివేకానందరెడ్డి డిపాజిట్ మాత్రం దక్కించుకున్నారు. అయితే ఈ ఓటమి వైఎస్సార్ సతీమణి అయిన విజయమ్మ మీదే కాబట్టి, దీనికి రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రాధాన్యత లేదు.

కానీ, ఇప్పుడు తొలిసారి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో వివేకానందరెడ్డి ఓడిపోవడం… వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో తొలి ఓటమిగా చెప్పుకోవచ్చు. ఈ ఓటమితో 40 ఏళ్ల వైయస్ కంచుకోట బీటలు వారిందని ప్రత్యర్థులు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గం, సొంత మండలమైన సింహాద్రిపురం నుంచే బీటెక్ రవి పోటీ చేసి గెలుపొందడం పరిస్థితిని మరింత దయనీయంగా మార్చివేసింది. దీంతో మండల స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో వైసీపీ ఆత్మస్థైర్యాన్ని తెలుగుదేశం పార్టీ దెబ్బతీసినట్టైంది.