ysrcp-jagan-suppoting-modi-for-2017-elections-national-wideఎప్పుడు ఎన్నికలు వస్తాయా… ఎప్పుడు తానూ ముఖ్యమంత్రిని అయిపోదామా… అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్న వైనం తెలిసిందే. ఎన్నికలు వస్తే చాలు… గెలుపు తనదే… అన్న రీతిలో మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా, ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కూడా తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల గురించి కొన్ని కీలక ప్రకటనలు చేసినట్లుగా మీడియా వర్గాల సమాచారం.

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదనలను ప్రస్తావిస్తూ… అతి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడం విశేషం. “తనకు అందిన సమాచారం ప్రకారం 2017లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మోడీ సిద్ధమవుతున్నారని, దీంతో అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని” చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీకి తానే ముఖ్యమంత్రిని అన్న భావనను అందరిలో ఏర్పరిచేందుకు ఏ ఒక్క విషయాన్ని కూడా జగన్ వదిలిపెట్టడం లేదని పొలిటికల్ వర్గాల టాక్.

ఎవరో జ్యోతిష్కుడు తనకు చెప్పాడంటూ… ఇప్పటివరకు పలు బహిరంగ సభల ద్వారా తన ఉద్దేశాన్ని చెప్తున్న వైసీపీ అధినేత, తాజాగా జ్యోతిష్కుడు స్థానంలో ప్రధాని మోడీని ప్రస్తావిస్తూ 2017లోనే ఎన్నికలు అన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నట్లుగా కనపడుతోంది. ఇది జగన్ భవిష్యవాణిలో మాత్రమే జరుగుతుందేమో గానీ, ‘ముఖ్యమంత్రి’ పీఠంపై జగన్ చూపుతున్న మక్కువ బహుశా దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు కూడా చూపించి ఉండరని చెప్పవచ్చు.