YSRCP-Gudivada-Amarnathకేంద్రం దయాదాక్షిణ్యాలతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు. కేంద్రం నెలనెలా అప్పులు, నిధులు విదిలించక పోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా కొనసాగలేదని రాష్ట్ర బిజెపి నేతలు చెపుతున్నారు కూడా. కనుకనే సిఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల భజన చేస్తూ వారి చుట్టూ తిరుగుతుంటారు. అయితే మంత్రి గుడివాడ అమర్నాధ్ హటాత్తుగా బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు తగినంత నిధులు, సహాయసహకారాలు అందిస్తున్నప్పటికీ వైసీపీ పాలనలో రాష్ట్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.

దానిపై మంత్రి గుడివాడ అమర్నాధ్ తీవ్రంగా స్పందిస్తూ, “ఎక్కడో యూపీ నుంచి ఎన్నికైన ఆయన తెగిన గాలిపటంలా కొట్టుకువచ్చి ఏపీకి చేరుకొని నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. పైరవీలు చేసుకొని ఆ పదవి సంపాదించుకొన్న ఆయన కనీసం సర్పంచ్‌గా అయినా పోటీ చేసి గెలవగలరా?అసలు బిజెపి నేతలు రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలి. విభజన హామీలపై చర్చకు రావాలని రాష్ట్ర బిజెపి నేతలకి నేను సవాల్ విసురుతున్నాను. విభజన హామీలను అమలుచేయాలని వారు ఢిల్లీలో తమ పెద్దలపై ఒత్తిడి చేయకుండా ఇక్కడ కూర్చొని కనీస అవగాహన లేకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని బిజెపి నేతలు నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐ‌టి రంగంలో రూ.1.14 కోట్లు టర్నోవర్ సాధిస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రొయ్యలు, చేపలు తదితర ఎగుమతులతో రూ.1.19 కోట్లు టర్నోవర్ సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందనే విషయం ఏపీ బిజెపి నేతలకి తెలుసో తెలియదో కానీ ఏపీ గురించి ఈ పిచ్చి వాగుడు మానుకొంటే మంచిదని చెపుతున్నా,” అని తీవ్రంగా హెచ్చరించారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ఎప్పుడూ అన్యాయమే చేసింది. ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్నా అన్యాయం చేస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మెల్లగా మునిగిపోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా మరిన్ని అప్పులు ఇప్పిస్తూ మరింత వేగంగా మునిగిపోయేందుకు తోడ్పడుతోంది. వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రం ఎంత అప్పు ఇప్పిస్తే అంతా తీసుకొంటూనే ఉంది. కనుక నేటి ఏపీ దుస్థితికి రెండు పార్టీలకి సమాన బాధ్యత ఉందని చెప్పక తప్పదు. కానీ ఏపీని వైసీపీ ఏదో ఉద్దరించేస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వైసీపీ ప్రభుత్వం మనుగడసాగిస్తునప్పుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్ బిజెపిని ఇంత తీవ్రస్థాయిలో విమర్శించడం చూస్తే ఏపీలో ఆ పార్టీతో ఉత్తుత్తి యుద్ధానికి వైసీపీ సిద్దం అవుతోందా? అనే సందేహం కలుగుతుంది.