YSRCP-govt-Teachers-insulted-on-Teachers-day-నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించడం ఆనవాయితీ. కనుక ఏపీ ప్రభుత్వం కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించాలనుకొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమను ఉపాధ్యాయులమనే కనీస గౌరవం చూపకుండా, పోలీసులతో భయపెట్టిస్తూ, అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఈ సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఓ పక్క ఉపాధ్యాయుల చేత అడ్డమైన చాకిరీ చేయించుకొంటూ 1వ తేదీన జీతాలు కూడా చెల్లించడం లేదని, పైగా మొబైల్ యాప్‌తో హాజరువేసుకోవాలని లేకుంటే జీతాలు కోసేస్తామంటూ తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గురువులకే పంగానామాలు పెడుతోందని వారు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తిస్తూ సన్మానాలు చేస్తామనడం తమని అపహాస్యం చేయడమే అని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎవరూ ఈ సన్మాన కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిర్ణయించారు.

కర్నూలు జిల్లా హోలగుంద మండలం, ప్రకాశం జిల్లాలోని కరిచేడు మండలం, ఏలూరు జిల్లా పోలవరం, జీడుగుమిల్లి, గుంటూరు, విజయనగరం జిల్లాలలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయులకు ఆదివారం సాయంత్రం వరకు జీతాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు అందలేదు.

“మొబైల్ యాప్‌తో అటెండన్స్ వేసుకోవడంలో విఫలమైతే జీతాలు కోస్తామని బెదిరిస్తున్నప్పుడు, సెప్టెంబర్‌ నెలలో ఐదు రోజులైనా ఇంతవరకు జీతాలు చెల్లించనప్పుడు దానికి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా?అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రతీనెల ఉద్యోగుల జీతాల చెల్లింపుకి రూ.5,500 కోట్లు అవుతుంది. ఆ లెక్కన ఐదు రోజులకు ప్రభుత్వం దానికి ఎంత వడ్డీ చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని ఐ‌టి కంపెనీలు కూడా ప్రతీనెల 31వ తేదీ అర్దరాత్రి తమ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్‌ 5వ తేదీ వచ్చినా ఇంకా ఆగస్ట్ నెల జీతాలు ఎందుకు చెల్లించడంలేదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించకుండా సన్మానాలు చేస్తామని చెప్పడం తమను అవహేళన చేయడమే అని అన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం ప్రతీనెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తూ తమను వేదించకుండా అదే గొప్ప సన్మానంగా భావిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.