Hindupur-Municipality-Billsవైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని, ప్రజలందరూ చాలా సుఖసంతోషాలతో సంతృప్తిగా జీవిస్తున్నారని సిఎం జగన్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గొప్పగా చెప్పుకొంటారు. అయితే ఆ అభివృద్ధి వారి ప్రసంగాలలో, పేపర్ ప్రకటనలలో మాత్రమే కనిపిస్తోంది తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వారికీ తెలుసు. వివిద జిల్లాలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో వైసీపీ కౌన్సిలర్లు, ఛైర్ పర్సన్‌లు మాట్లాడిన మాటలు వింటే వాస్తవ పరిస్థితులు అర్దం అవుతాయి.

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం కౌన్సిల్ సమావేశంలో 20వ వార్డు కౌన్సిలర్ పరశురామ్ మాట్లాడుతూ, “ఈ రెండేళ్ళలో నా వార్డులో ఒక్క అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేయలేకపోవడంతో ప్రజల ముందు తలదించుకోవలసివస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నేను ఎన్నిసార్లు బ్రతిమాలుకొన్నా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం లక్ష రూపాయాలు కూడా ఇవ్వలేనప్పుడు ఇంక నేనేమి పనులు చేయించగలను?రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మన పార్టీయే కదా?మరి నిధులు కేటాయించకుండా ఎందుకు తిప్పించుకొంటున్నారు? నా వార్డులో పనులు చేయించలేనప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని ప్రజల మద్య తిరగగలను?అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను,” అంటూ తన రాజీనామా పత్రాన్ని ఛైర్ పర్సన్‌ ఇంద్రజకు సమర్పించారు. ఆయనకు నచ్చజెప్పేందుకు తోటి వైసీపీ సభ్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వినకుండా రాజీనామా లేఖ సమర్పించి కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోయారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మది మరో రకమైన బాధ! ఆమె బుదవారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా పలువురు అధికారులు ఎవరూ హాజరుకాకపోవడంతో షాక్ అయ్యారు. ఆమె సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అధికారులు ఎవరికీ మనమంటే ఖాతరు లేకుండా పోతోంది. నా కొడుకు భరత్ పట్టణంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించమని నేను అధికారులను బ్రతిమాలుకోవలసివస్తోందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. అధికార పార్టీలో ఉన్న నాకే బిల్లులు చెల్లించకపోతే ఇక బయట కాంట్రాక్టర్లకు ఏం చెల్లిస్తారు?ఎప్పుడు చెల్లిస్తారు?పట్టణంలో మున్సిపాలిటీ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంత దయనీయంగా లేదు. అందరం ఒకరికొకరం మన గోడు చెప్పుకొని బాధపడటానికే నెలకోసారి సమావేశం పెట్టుకొంటున్నట్లుంది తప్ప మరే ప్రయోజనం కనబడటం లేదు,” అని అన్నారు. మిగిలిన కౌన్సిలర్లు తాము కూడా ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్నామని, ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు తదితరులు ఛైర్మన్‌ రాఘవేంద్రతో దాదాపు యుద్ధమే చేశారు. తమ వార్డులలో చిన్న చిన్న పనులు కూడా చేయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గడప గడపకి కార్యక్రమంలో ప్రజల వద్దకి వెళితే తమని నిలదీస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కన మళ్ళీ మన పార్టీకే ఓట్లు వేయమని ప్రజలను ఎలా అడగగలమని ప్రశ్నించారు.

బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు డబ్బులు పంచేస్తుంటే లబ్దిదారులు గుడ్డిగా మళ్ళీ వైసీపీకే ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్న సిఎం జగన్‌ వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొంటామని చెప్పుకొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇదీ… వాస్తవ పరిస్థితి!