YS_Jagan_Mohan_Reddyపేరు గొప్ప… ఊరు దిబ్బ అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం తీరు. అప్పులు, ఖర్చులే తప్ప ఆదాయం లేని వైసీపీ ప్రభుత్వం మెడకి సంక్షేమ పధకాలే గుదిబండలుగా మారుతున్నాయి. అందుకే అదనపు ఆదాయం కోసం మద్యం బాండ్స్, ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్మకాలు వంటి చిత్రవిచిత్రమైన నిర్ణయాలు, ఆలోచనలతో భారంగా రోజులు గడిపేస్తోంది. రాష్ట్రంలో నిరుపేద ప్రజల నుంచి సైతం నెలకు రూ.30 చెత్తపన్ను వసూలు చేస్తున్న జగన్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ చెత్తను ఊడ్చే అవుట్ సోర్సింగ్ పారిశుద్య కార్మికులను సైతం విడిచిపెట్టడంలేదు!

అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న రాష్ట్రంలోని పారిశుద్య కార్మికులకు నెలకు రూ.12,000 జీతం చెల్లించేది. హెల్త్ అలవెన్స్ పేరుతో మరో రూ.6,000 కలిపి నెలకు మొత్తం రూ.18,000 చెల్లించేది. ఈ ఏడాది జనవరి నుంచి పారిశుద్య కార్మికులందరికీ నెలకు రూ.3,000 చొప్పున జీతం పెంచుతున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొన్నారు. కనుక దాంతో కలిపి నెలకు రూ.21,000 రావలసి ఉంది. కానీ హెల్త్ అలవెన్స్ రూ.6,000 ఇవ్వడం మానేసి కేవలం రూ.15,000 మాత్రమే చెల్లిస్తోంది. అంటే పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.3,000 జీతం పెంచి రూ.6,000 కోసేసుకొంటోందన్న మాట!

దీనిపై పారిశుద్య కార్మికులు అధికారులకు మొర పెట్టుకొంటున్నా పట్టించుకొనే నాధుడే లేడు. నిజానికి హెల్త్ అలవెన్స్ అనే వేరే పేరు పెట్టకుండా ఉండి ఉంటే అది కూడా జీతంగానే ఉండేది. కానీ హెల్త్ అలవెన్స్ అనే పేరుతో ఇస్తుండటంతో దానిని ప్రభుత్వం ఇవ్వకుండా నిలిపివేసింది.

అయితే పారిశుద్య కార్మికులు మాత్రం హెల్త్ అలవెన్స్ పేరుతో వస్తున్న రూ.6,000ని కూడా జీతంగానే పరిగణించుకొంటారని వేరే చెప్పక్కరలేదు. కానీ గత ఆరు నెలలుగా ప్రభుత్వం దానిని చెల్లించకుండా తొక్కిపట్టడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

జీతం పెంచినట్లు ప్రకటించి, హెల్త్ అలవెన్సును నిలిపివేసి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారందరూ అవుట్ సోర్సింగ్ కార్మికులు కావడంతో గట్టిగా అడిగితే ఉన్న ఆ ఉద్యోగం, ఆదాయం కూడా పోతుందనే భయంతో అడగలేక మౌనంగా పనిచేసుకుపోతున్నారు. చివరికి పారిశుధ్య కార్మికులను కూడా వైసీపీ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు!