Perni_Nani_YSRCP_Ex_Ministerబిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న రాజమండ్రి సభలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై మాజీ మంత్రి పేర్ని నాని అంతే ఘాటుగా స్పందించారు.

తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మేము విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తున్నామని, 8 లక్షల కోట్లు అప్పులు చేశామని జేపీ నడ్డా చెప్పారు. మేము శృతి మించి అప్పులు చేస్తుంటే కేంద్రం కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోంది?మీ ఆర్ధిక మంత్రి ఏమి చేస్తున్నారు?మీ రిజర్వ్ బ్యాంక్ ఏమి చేస్తోంది?మీ ఆర్ధిక వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి?

అసలు రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో కూడా తెలుసుకోకుండా పువ్వు పార్టీ నాయకుడు ఎగేసుకొని వచ్చేసి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేశారు. ఇక్కడికి వచ్చే ముందు మీ ఆర్ధికమంత్రిని అడిగితే ఆమె రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో చెప్పేవారు కదా?

అయినా 2014లో మీ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు దేశానికి రూ.53 లక్షల కోట్ల అప్పులు ఉండగా వాటిని మీ మోడీ ప్రభుత్వం రూ.130 లక్షల కోట్లు చేసి దేశాన్ని నిలువునా ముంచేస్తోంది. అంటే ఈ 8 ఏళ్ళలోనే మీ పువ్వు బ్యాచ్ చేసిన అప్పు రూ.80 లక్షల కోట్లు! ఇటువంటి మీరు మా అప్పుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. అసలు అప్పుల గురించి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతారు?” అని పేర్ని నాని ప్రశ్నించారు.

“అసలు మీ మోడీ ప్రభుత్వం దేశానికి ఏమి చేసింది?అంటే కులాలు, మతాలతో ప్రజల మద్యన చిచ్చుపెట్టడం, మసీదులను కూల్చి శవాలు, శివాలింగాలు తవ్వి తీస్తామని చెపుతుంటారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన మూడేళ్ళుగా మతచిచ్చు రగిలించేందుకు ప్రయత్నించని రోజు ఒక్కటైనా ఉందా?

కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టిస్తున్నామట! అబ్బో… రాష్ట్రానికి ఏదో భారీగా నిధులు ఇచ్చేస్తున్నట్లు మాట్లాడారు. గోదావరి ఒడ్డున నిలబడి పోలవరం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు అని ప్రకటించి దానికి నిధులు ఇస్తున్నారా?కనీసం చేసిన పనులకి బిల్లులు కూడా చెల్లించడం లేదు. మాకు చెవులో పూలు పెడదామని ఢిల్లీ నుంచి ఎగేసుకొచ్చారు. మీరు చెప్పే అబద్దాలను నమ్మడానికి రాష్ట్రంలో ప్రజలేవైనా చెవిలో కమలం పువ్వులు పెట్టుకొన్నారా?

మా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు గొంతు నొక్కుతోందట!దేశంలో ప్రతిపక్ష నేతలపై ఐటి, ఈడీ దాడులు చేయిస్తూ ఎవరు వేదిస్తున్నారు?మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎంత మందిని జైళ్ళలో పెట్టించారో అందరికీ తెలుసు. ప్రజలెవరూ మీ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలను చూడలేదనుకొంటున్నారు. జేపీ నడ్డా అడ్డంగా పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు.

మేము రాష్ట్రంలో ఏడాదికి రూ.2,300-2,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేస్తుంటే, ఆయుష్మాన్ భారత్‌లో రూ.5 లక్షలు చొప్పున ఇస్తున్నామని జేపీ నడ్డా ఏమాత్రం సిగ్గుపడకుండా చెపుతున్నారు. ఎవరో కనకదుర్గ గుడిలో రధానికి ఉన్న వెండి సింహం బొమ్మను ఎత్తుకుపోతే దానిపై కూడా బిజెపి మత రాజకీయాలు చేస్తోంది.

జేపీ నడ్డా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కేంద్రమంత్రులను అడిగితే ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో, ఏపీకి ఎంత అప్పు ఉందో అన్నీ చెప్పేవారు కదా?కానీ ఏమీ తెలుసుకోకుండా ఎగేసుకువచ్చి ఇక్కడ చెవిలో ఎవరు ఏది చెపితే అది నోటికి వచ్చినట్లు వాగారు. ఈ దేశానికి ఇలాంటి పాలకులు ఉండటం దేశ ప్రజల దౌర్భాగ్యం,” అంటూ పేర్ని నాని మోడీ ప్రభుత్వాన్ని, జేపీ నడ్డాని, బిజెపిని ఘాటుగా విమర్శించారు.