sujay-krishna-ranga-rao-joining-TDPsujay-krishna-ranga-rao-joining-TDPవరుస ఎదురు దెబ్బలు తగులుతున్న వైసీపీకి విజయనగరం జిల్లాలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయే పరిస్థితి ఎదురు కానుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలుండగా, గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏడింటిలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, మిగిలిన మూడు స్థానాలను జగన్ పార్టీ సభ్యులు సొంతం చేసుకున్నారు.

బొబ్బిలి (సుజయకృష్ణ రంగారావు), సాలూరు (రాజన్నదొర), కురుపాం (పుష్ప శ్రీవాణి) నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు బేబి నాయన కూడా టీడీపీలో చేరనున్నారు. అలాగే, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా పార్టీ మారే అవకాశాలున్నాయన్న పిడుగు లాంటి వార్తతో బొబ్బిలి కోటకు వెళ్లిన విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి తదితరులకు కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని రాజన్నదొర ముఖం మీదే చెప్పేసారన్న సమాచారంతో వైసీపీ వర్గాలు నిరాశగానే వెనుతిరిగాక తప్పని పరిస్థితి.

ఇక అసెంబ్లీ లోపల, బయట జరుగుతున్న పార్టీ ఆందోళనల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటున్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా టీడీపీలో చేరుతున్నట్లు మీడియా వర్గాల వేదికగా వార్తలు జోరందుకున్నాయి. పుష్ప శ్రీవాణి టీడీపీలో చేరిపోతే… ఉత్తరాంధ్రలో కీలక జిల్లా అయిన విజయనగరం మొత్తం టిడిపి వశం అవుతుండగా, వైసీపీకి అసలు ప్రాతినిధ్యం గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.