YSRCP_Distributing_Money_MLC_Elections_2023నేడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం; ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు; కడప-కర్నూలు-అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలుకాగా, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు; కడప-కర్నూలు-అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు. శ్రీకాకుళం, కర్నూలులో చెరొకటి, పశ్చిమగోదావరి జిల్లా 2 స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

సరిగ్గా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినప్పుడే ఈ ఎన్నికలు రావడం దేవుడి స్క్రిప్ట్ అనుకోవాలో లేదా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొంటే వారు యుద్ధం ప్రకటించారో తెలియదు కానీ, శాసనసభ ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారడం విశేషం.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మేమే అవలీలగా గెలుస్తామని వైసీపీ నేతలు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఓటర్లకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ మంత్రి ఉష శ్రీచరణ్ అడ్డంగా దొరికిపోయారు. ఆమె శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యి, ఏ పంచాయతీలో ఎన్ని ఓట్లున్నాయి? వారందరికీ డబ్బు అందిందా లేదా? అందేపల్లి గ్రామంలో ఓటర్లకు డబ్బులు అందాయో లేదో ఫోన్లు చేసి కనుక్కోండి….” అంటూ ఆదేశాలు ఇస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయడంతో అది వైరల్ అయ్యింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆర్డీవోని కలిసి మంత్రి స్వయంగా డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తిరుపతి పట్టణంలో వైసీపీ నేతలు పట్టభద్ర ఓటర్లకు ఒక్కొక్కరికీ రూ.1,000 చొప్పున బహిరంగంగానే పంచిపెడుతున్నారు. టిడిపి నేతలు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా, “మాకు అడ్డురాకండి. కావాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి మాపై ఫిర్యాదు చేసుకోండి,” అని చెప్పి పంపించేశారు. ఎన్నికలకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించినా, చాలా ప్రాంతాలలో వాలంటీర్ల ద్వారానే వైసీపీ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లకు మొబైల్ యాప్స్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.5,000 చొప్పున పంచారు. కర్నూలులో పట్టభద్రుల ఓటర్లకు రూ.1,000, ఉపాధ్యాయ ఓటర్లకు రూ.5,000 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక అనేకచోట్ల ఒకే అడ్రస్సులో డజన్ల కొద్దీ బోగస్ ఓటర్లు, పదో తరగతి వరకే చదువుకొన్నవారు పట్టభద్ర ఓటర్లుగా నమోదైన్నట్లు గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఎన్నికలు వైసీపీకి అగ్నిపరీక్ష మాత్రమే కాదు… టిడిపి, జనసేనలకు ఓ గట్టి హెచ్చరికవంటివి కూడా! ఎందుకంటే ఎన్నికలలో వాలంటీర్లను వైసీపీ ఏవిదంగా ఉపయోగించుకోబోతోందో, ఏ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తోందో, ఏవిదంగా బెదిరింపులకు పాల్పడుతోందో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినా ఓడినా వైసీపీకి పెద్ద తేడా ఏమీ ఉండదు. అయినా ఇటువంటి ఎన్నికలలోనే ఈవిదంగా వ్యవహరిస్తున్నప్పుడు, వైసీపీకి, ముఖ్యంగా… సిఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రుల రాజకీయ భవిష్యత్‌ను తారుమారు చేయగల శాసనసభ ఎన్నికలలో మరింకెంత దూకుడుగా వ్యవహరిస్తారో ఎవరూ ఊహించలేరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే. కనుక టిడిపి, జనసేనలు శాసనసభ ఎన్నికలలో వైసీపీని, దానికి అండగా నిలువబోయే లక్షలాది వాలంటీర్లను ఏవిదంగా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ఆలోచించుకొంటే మంచిది. ఆనక ఆకులు పట్టుకొని బాధపడినా ప్రయోజనం ఉండదు.