YSRCP_Dharmana-Prasada-Raoఆంధ్రప్రదేశ్‌ సీనియర్ రాజకీయ నాయకులలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. సుదీర్గ పరిపాలనానుభవం కూడా ఉంది. కానీ మంత్రిగా ఉంటూ ఆయన పదేపదే ప్రజలని రెచ్చగొట్టేవిదంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. విశాఖని రాజధాని చేయకపోతే విశాఖ కేంద్రంగా ఉత్తరాంద్ర జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిద్దామని ప్రజలని రెచ్చగొడుతున్నారు.

తాజాగా ఆయన మరో వివాదస్పద వ్యాఖ్య చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని సతివాడ పంచాయతీలో సోమవారం గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాలంటీర్లని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ముందుగా ఆయన తుపాకీ మీ మీదే పేల్చుతారు. మీ అందరి ఉద్యోగాలు ఊడగొట్టి ఇంటికి పంపించేస్తారు. కనుక ఇప్పుడు ఆ తుపాకీ మన చేతుల్లోనే ఉంది కనుక మనమే ముందు పేల్చేస్తే పోలా?వాలంటీర్లు కూడా ఈ రాష్ట్రంలో పౌరుడే. కనుక వాలంటీర్లు ఏది మంచి ఏది చెడు అని ప్రజలకి వివరించి చెప్పవచ్చు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకొనేందుకు మీరు ప్రజలకి తోడ్పడవచ్చు. కనుక ముందుగా మీ పరిధిలో ఉన్న 50 కుటుంబాలపైన దృష్టి పెట్టండి. వారందరినీ వైసీపీకే ఓట్లు వేసేలా చేయండి. అలా చేస్తే మీ ఉద్యోగాలు మీరు కాపాడుకొన్నట్లవుతుంది కదా?” అని మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు.

వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలతో స్పష్టమవుతోంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వోద్యోగుల ఉద్యోగాలు పోవు. కానీ వైసీపీ రాజకీయ అవసరాల కోసం వైసీపీ ప్రభుత్వం చట్టబద్దత, రాజ్యాంగ బద్దత, ఉద్యోగ భద్రత లేని ఓ వాలంటీర్ వ్యవస్థని సృష్టించింది. కనుక ప్రభుత్వం మారితే వారి ఉద్యోగాలు కోల్పోవడం సహజం. ఇటువంటి ఉద్యోగాలని సృష్టించి వారిని రోడ్డున పడేస్తున్నందుకు వైసీపీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికి చంద్రబాబు నాయుడుని బూచిగా చూపి భయపెడుతున్నారు. మీ ఉద్యోగాలు మీకుండాలంటే ఎట్టి పరిస్థితులలో వైసీపీని గెలిపించాలని ఒత్తిడి చేస్తున్నారు. వాలంటీర్లని ప్రజల మీద కూడా ఒత్తిడి చేయాలని సూచిస్తున్నారు.

వాలంటీర్లు కూడా పౌరులే అని మంత్రిగారు చెపుతున్నప్పుడు వారిని వైసీపీ కార్యకర్తలుగా ఎందుకు భావిస్తున్నారు? వారు వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని లేకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరించడానికి అర్దం ఏమిటి?వాలంటీర్ల జీవితాలతో ఆడుకొంటున్నది వైసీపీ కాదా?