YSRCP-Dharmana-Prasada-Rao-Dwacra-Womenమంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తుంటే లబ్దిదారులు స్వచ్ఛందగానే తరలివస్తారు. కానీ చెక్కులు అందుకొన్నాక వారి ఊకదంపుడు ప్రసంగాలు వినమంటే వినకుండా పారిపోతుంటారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని రాగోలులో మంత్రి ధర్మాన ప్రసాదరావు లబ్ధిదారులకు ఆసరా చెక్కుల పంపిణీ చేశారు.

తర్వాత ఆయన ప్రసంగిస్తుండగా మద్యలో మహిళలు లేచి వెళ్ళిపోతుంటే, ఓ అమ్మా… ఇలా మద్యలో లేచివెళ్ళిపోవద్దు. మరికొద్ది సేపటిలో మీటింగ్ అయిపోతుంది! కాస్త ఓపిక పట్టండి. బాబూ ఆటో డ్రైవర్లూ… మీరూ ఆటోలు తీయకండి,” అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

చెక్కులు అందజేసినా ఓ 5 నిమిషాల సేపు మంత్రిగారి మాటలు వినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపనప్పుడు, వారు వైసీపీకి విధేయంగా ఉంటారని భావించగలమా?

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ సభలో మాట్లాడుతూ తనకు ఎదురైన మరో చేదు అనుభవం గురించి చెప్పుకొన్నారు. “మొన్న ఓ చోట ఆసరా చెక్కు అందుకొన్న స్వయంశక్తి సంఘాల మహిళలు ‘జగనన్న తన ఇంట్లో డబ్బు ఏమైనా మాకు పంచిపెడుతున్నాడా?’ అని అడిగారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు తీసుకొంటూ ఇంత సంస్కారహీనంగా మాట్లాడితే ఎలా?ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా ఇలా డబ్బులు ఇచ్చారా? కానీ జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇస్తునే ఉన్నాడు కదా?ఇన్నేళ్ళు జగనన్న ఇస్తున్న డబ్బులు తీసుకొని ఆయనకు ఓట్లు వేయకపోతే మీ చేతులను మీరే నరుక్కొన్నట్లే లెక్క. కాస్త బుర్ర పెట్టి ఆలోచించడర్రా. మీలో చదువుకొన్న అమ్మాయిలు చాలా మందే ఉన్నారు కదా?కాస్త మీరైనా వాళ్ళకి అర్దమయ్యేలా చెప్పండర్రా,” అని అనడంతో సభలో మహిళలు ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.

సంక్షేమ పధకాల పేరిట పంచుతున్న లక్షల కోట్లు వైసీపీ నేతల కష్టార్జితం నుంచి తీసి పంచడంలేదనే విషయం సాధారణ గ్రామీణ మహిళలు సైతం గ్రహించి మంత్రికి చురకలు వేస్తున్నట్లు ఆయన మాటలతోనే అర్దమవుతోంది. వాటి కోసం ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూ, ఆ భారం తిరిగి తమపైనే వేస్తోందనే విషయం గ్రామీణ మహిళలు సైతం గుర్తిస్తున్నారు కనుకనే నిలదీస్తున్నారనే అతిముఖ్యమైన విషయం గ్రహించకుండా, లబ్ధిదారులు తమకు కృతజ్ఞతగా ఉండాలని, లేకుంటే సంస్కార హీనులని అనడం, తమను నిలదీస్తున్న మహిళలు బుర్రపెట్టి ఆలోచించాలని, వారికి ఆలోచించే తెలివితేటలు లేవు కనుక చదువుకొన్న మహిళలు వారికి నచ్చ చెప్పాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడం చూస్తే మహిళల పట్ల ఆయనకు ఎంత గొప్ప అభిప్రాయాలున్నాయో అర్దం అవుతోంది. లబ్ధిదారులు ఇంత చైతన్యంగా నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు సంక్షేమ పధకాలు వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు రాల్చుతాయా? ఆలోచించుకొంటే మంచిదేమో?