YSRCP Councellor Slaps Commissionerపురుషలందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు పార్టీలందు వైసీపీ వేరయా అని చెప్పుకోవలసి వస్తోంది. టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు, దాడులు సర్వసాధారణమైపోయాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం దానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

నర్సీపట్నంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడి కుమారుడి ఇంటి ప్రహారీగోడను తెల్లవారుజామున 4 గంటలకు కూల్చివేయడం, చిత్తూరు మాజీ మేయర్ హత్య కేసులో సాక్షిగా ఉన్న టిడిపి కార్యకర్తని అక్రమ గంజాయి రవాణా చేస్తున్నాడని అరెస్ట్ చేయడం… ఇలా చెప్పుకొంటే ఆ జాబితా చాంతాడంత అవుతుంది.

అయితే వైసీపీ నేతల జులుం టిడిపికే పరిమితం కాలేదు. అధికారులు, సిబ్బందిపై కూడా వారికి బలవుతునే ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో వైసీపీ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి కమీషనర్‌ రాంబాబుపై దాడి చేసి చెంప చెళ్ళుమనిపించారు. దీంతో ఆయనకు సంఘీభావం తెలుపుతూ రాయచోటి మున్సిపల్ సిబ్బంది శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వైసీపీ నేతలు ఈవిదంగా తమపై దాడులు చేస్తుంటే పనిచేయలేమని, తక్షణం నర్సింహారెడ్డితో సహా ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏమిటంటే, రాయచోటిలో అనేక ఏళ్ళుగా నడుస్తున్న ఓ భూవివాదంలో వైసీపీ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి జోక్యం చేసుకోవడమేనని తెలుస్తోంది. ఆ లేఅవుట్‌ నిబందనల ప్రకారం లేకపోవడంతో కమీషనర్‌ అనుమతించలేదు. దానిపై కొంతకాలంగా ప్రతిష్టంభన ఏర్పడింది.

దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న వైసీపీ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి నిన్న తన అనుచరులను వెంటబెట్టుకొని కమీషనర్‌ కార్యాలయానికి వచ్చి లే అవుట్ గురించి ఆయనతో వాదనకి దిగారు. లేఅవుట్ తాలూకు పత్రాలన్నీ సవ్యంగా ఉన్నట్లయితే పరిశీలించి అనుమతి మంజూరు చేస్తానని కమీషనర్‌ రాంబాబు చెపుతుండగా, నరిసింహారెడ్డి ఆయన చొక్కా కాలర్ పట్టుకొని చెంప చెళ్ళుమనిపించారు.

వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది కానీ కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై వైసీపీ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి వాదన కూడా విన్న తరువాత కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

కమీషనర్‌పై దాడి చేసిన వైసీపీ కౌన్సిలర్ నర్సింహా రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, “లే అవుట్ అనుమతి కోసం మేము దరఖాస్తు చేసుకొంటే ఇవ్వకుండా లంచం కోసం డిమాండ్ చేస్తూ మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. అదే విషయం ఆయనను అడిగేందుకు వెళ్ళాము తప్ప ఆయనపై దాడి చేయలేదు,” అని అన్నారు.

అయితే తమ పార్టీ కౌన్సిలర్ కమీషనర్‌పై దాడి చేయడాన్ని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప భౌతికదాడులు చేయడం సరికాదు,” అని అన్నారు.