YSRCP Comedian-Aliఅలీ… ఈ పేరు వింటేనే అందరి మొహాలలో చిర్నవ్వులు పూస్తాయి. తెలుగు ప్రజలకు అత్యంత ప్రియమైన హాస్యనటుడు అలీ తన కామెడీతో అందరినీ సంతోషపరిచారే కానీ ఏనాడూ ఎవరినీ బాధపెట్టలేదు. అందరినీ ఆనందంగా నవ్వించే అలీని జగనన్న కన్నీళ్ళు ఒక్కటే తక్కువ అన్నట్లు ఏడిపించారు. విషయం అందరికీ తెలిసిందే!

అలీ ఎప్పటికైనా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవుదామని కలలుగంటే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎందుకు… ఏకంగా రాజ్యసభకే పంపిస్తామన్నట్లు వైసీపీ అందలం ఎక్కించడంతో అలీ కూడా చాలా సంతోషించారు. కానీ రాజ్యసభ సభ్యుడుగా కాదు కదా… కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా, ‘ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు’ పదవి ఇస్తూ జీవో జారీ చేసింది జగనన్న ప్రభుత్వం. దానిని చూసి అలీ ఏడ్వలేక నవ్వాల్సి వచ్చింది.

ఇప్పటికే డజను మందికి పైగా ప్రభుత్వ సలహాదారులున్నారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తప్ప మరెవరి పేర్లు ఎవరికీ తెలిసి ఉండవు. అయినా సర్వం తానే అనుకొనే జగనన్నకు ఇటువంటివారి బోడి సలహాలు అవసరమా? నిజంగా వారి సలహాలు మేరకు పనిచేస్తే ఇన్ని విమర్శలు, ఆరోపణలు వినిపించేవా? జగనన్న ప్రభుత్వం ఇన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఉండేదా?

ప్రభుత్వ సలహాదారు అంటే చేతికి ఉంటే పనికిరాని ఆరో వేలు వంటిదే. ఏదో పదవి, నెలకు ఓ రెండు లక్షలు జీతభత్యాలు, కారుకి తగిలించుకోవడానికి ఓ ప్లేటు లభిస్తాయి తప్ప వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోరని అందరికీ తెలుసు. దశాబ్ధాలుగా సినిమాలు చేస్తున్న అలీకి చేతి నిండా డబ్బు, సమాజంలో పేరు ప్రతిష్టలకి కొదవేలేదని అందరికీ తెలుసు. కనుకనే అలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి కోరుకొన్నారు. కానీ జగనన్న ఈ పనికిరాని ఆరోవేలు వంటి ఈ పదవిని కట్టబెట్టారు. అయితే ఈ పదవి అక్కరలేదంటే జగనన్న అహం దెబ్బతింటుంది. తింటే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఆయనతో అంటకాగుతున్న అలీకి తెలియదనుకోలేము. అందుకే జగనన్న మాట తప్పడని, మడమ తిప్పడని ఓసారి పొగిడేసి ఇది తన కుమార్తె పెళ్ళికి వచ్చిన తోఫాగా స్వీకరిస్తున్నానని ఏడ్వలేక నవ్వుతూ చెప్పారు. ఇంతకీ ఆ పదవితో అలీ ఎమ్మెల్యే చేయాలో… ఏం చేస్తారో? పవన్‌ కళ్యాణ్‌ని నమ్ముకొన్నా ఇంతకంటే ఎంతో గౌరవంగా ఉండేది కదా! పాపం అలీ!