Botsa-Satyanarayana-YSRCPజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం విజయనగరం జిల్లా, గుంకలాంలో పర్యటించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్ళను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాటిలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ విమర్శలపై జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “జనసేన పార్టీని అసలు ఓ రాజకీయ పార్టీయే కాదు. దానికో సిద్దాంతం, విధానం ఏమీ లేవు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదు. నా దృష్టిలో అదో సెలబ్రేటీ పార్టీ మాత్రమే. పవన్‌ కళ్యాణ్‌ సినిమా నటుడు గనుక ఆయన వస్తే చూసేందుకు జనం ఎగబడతారు. అంతే!

నిన్న విజయనగరం వచ్చినప్పుడు కూడా జగనన్న ఇళ్ళని చూసి అలాగే నోటికి వచ్చిన్నట్లు వాగేసి వెళ్లిపోయారు. రాష్ట్రంలోకెల్లా నా జిల్లాలోనే ఇదే అతి పెద్ద ప్రాజెక్టు. దాని గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే మేము వేలకోట్లు నొక్కేశామని చెప్పేశారు. ఆవేమైనా రెయిన్ కోట్లా… ఉలెన్ కోట్లా నొక్కేయడానికి?అసలు ఆ ఇళ్ళ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా అంతలేదు. మరి ఖర్చు కంటే అవినీతి ఎలా ఎక్కువగా ఉందని ఎలా చెపుతున్నారు? ఆయనకి తెలియకపోతే వెళ్ళి చంద్రబాబు నాయుడునో మరొకరినో అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు టిడిపి హయాంలో ఎన్ని ఇళ్ళు నిర్మించిందో ఇప్పుడు మా ప్రభుత్వం హయాంలో ఎన్ని ఇళ్ళు నిర్మిస్తోందో పవన్‌ కళ్యాణ్‌కి ఏమైనా తెలుసా?

రాష్ట్రంలో 30 లక్షలమంది అర్హులైన పేదవారు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిస్తే, వారందరికీ కూడా ఇళ్ళు కట్టించి ఇద్దామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దేశంలో మరే నాయకుడు పేదల కోసం ఆయన అంత గొప్పగా ఆలోచించలేరు. మొన్న ప్రధాని నరేంద్రమోడీ విశాఖ వచ్చినప్పుడు కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి తనకు పార్టీలు రాజకీయాల కంటే, రాష్ట్రం, దేశమే ముఖ్యమని చెప్పారు. మరెవరైనా అలా చెప్పగలరా?

ప్రధాన మంత్రి పిలిచి మాట్లాడినంత మాత్రాన్న పవన్‌ కళ్యాణ్‌కి ఆ స్థాయి వచ్చేయదు. జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను చూసేందుకు పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారంటే, మేము లబ్దిదారులను పంపించి ఆయనతో మాట్లాడించగలము. కానీ అలా చేస్తే మేమేదో ఆయనను అడ్డుకొన్నామంటూ ప్రచారం చేసుకొంటారు… అప్పుడు విశాఖకు వచ్చి హడావుడి చేసి వెళ్ళినట్లు!

అందుకే మేము ఆయనని పట్టించుకోలేదు. వస్తాడు… కాసేపు అటూ ఇటూ తిరుగుతాడు. తర్వాత నోటికి వచ్చినట్లు ఏదో వాగేసి పోతాడని ఊరుకొన్నాము. అయితే అతను నిన్న విజయనగరానికి వచ్చినప్పుడు మా మీద కొన్ని ఆరోపణలు చేసి వెళ్లారు. కనుక నేను వాటికి సమాధానం చెప్పకపోతే నేనే తప్పు చేశానని జనం అనుకొంటారు. అందుకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది. జగనన్న ఇళ్ళలో నేను ఒక్క తప్పు చేసినట్లు నిరూపించినా తల దించుకొంటాను,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.