YSRCP Bonthu Rajeswara Rao Joins Janasena Partyకోనసీమ జనసేనలో తార్‌మార్ తక్కడ్‌మార్ జరుగుతోంది. ఎలా అంటే… గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సహా పోటీ చేసిన వారందరూ ఓడిపోయారు కానీ ఒకే ఒక్కరు గెలిచారు. ఆయనే రాపాక వరప్రసాద్‌. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో ఉండేవారు కానీ టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరిపోయి టికెట్ సాధించుకొని రాజోలు నుంచి పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాతే అసలు కధ మొదలైంది. టికెట్ ఇవ్వలేదని అలిగి బయటకువచ్చారు తప్ప పార్టీతో విభేధించి కాదు కనుక ఆయన జనసేన టికెట్‌పై గెలిచినప్పటికీ వైసీపీతోనే సన్నిహితంగా మెలుగుతున్నారు. రాజకీయాలలో ఇది సహజమే. అయితే గత ఎన్నికలలో రాజోలు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి రాపాక వరప్రసాద్‌ చేతిలో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుకి ఇది మింగుడుపడటం లేదు.

పార్టీలో ఉన్న తన కంటే జనసేనలో ఉన్న రాపాకకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని రోజుల ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి తన అసంతృప్తిని సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళేలా చేశారు. కానీ ఆయన పట్టించుకోలేదు పైగా వరుసగా రెండుసార్లు ఓడిపోయినందున వచ్చే ఎన్నికలలో టికెట్ కూడా ఇవ్వలేమని ఖరాఖండీగా చెప్పేసినట్లు తెలుస్తోంది.

కనుకబొంతు రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను ఎవరి వలనైతే వైసీపీకి రాజీనామా చేయవలసి వచ్చిందో, అతను ఉండే పార్టీలోకే ఎందుకు చేరుతున్నారంటే రాపాక వరప్రసాద్ మళ్ళీ వైసీపీ గూటికి వెళ్ళిపోవడానికి మూటాముల్లె సర్దుకొంటున్నారుట!

మరోవిషయం ఏమిటంటే గత ఎన్నికలలో రాజోలులో జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయబోతుంటే, గత ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వర రావు వచ్చేసారి జనసేన తరపున పోటీచేయబోతున్నారు. తార్‌మార్ తక్కడ్‌మార్ అంటే ఇదే కదా?