BRS-YSRCPతెలంగాణలో తిరుగులేని రాజకీయపార్టీగా నిలిచిన టిఆర్ఎస్‌ నేటి నుంచి జాతీయపార్టీ బిఆర్ఎస్‌గా మారింది. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడలో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. బిఆర్ఎస్‌ ఇతర రాష్ట్రాలకు విస్తరించవలసి ఉంది కనుక మొట్టమొదట తమకు అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి విస్తరించబోతోంది. వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగ సమయంలో సిఎం కేసీఆర్‌ విజయవాడ లేదా గుంటూరులో భారీ బహిరంగసభ ఏర్పాటుచేయబోతున్నట్లు తాజా సమాచారం. అంటే ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, జనసేన, బిజెపిలకు దాని నుంచి కొత్త సవాళ్ళు ఎదురవనునాయన్న మాట!

బిఆర్ఎస్‌ ఏర్పాటుపై ఏపీ మంత్రి జోగి రమేష్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ బిఆర్ఎస్సే కాదు… ఏ పార్టీ వచ్చినా ఏపీలో వైసీపీకి ఢోకా లేదు. ఏ పార్టీ కూడా వైసీపీని కదిలించలేవు. మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు కనుక ఏ పార్టీని చూసి వైసీపీ భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికలలో కూడా మా పార్టీయే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.

ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌ మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలే అధికారంలో ఉన్నాయి. అవి బలంగా ఉన్న రాష్ట్రాలలో జాతీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిలద్రొక్కుకోలేకపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఏపీలో వైసీపీ చాలా బలంగా ఉంది. కనుక ఏపీలో రాజకీయ శూన్యత లేదు. కనుక బిఆర్ఎస్‌ను ఏపీ ప్రజలు ఆదరిస్తారనుకోను. గతంలో అధికారంలో ఉన్న టిడిపినే వైసీపీ ఓడించింది. కనుక ఏపీలో వైసీపీ తప్ప మరో ప్రాంతీయ పార్టీకి కూడా అవకాశం లేదని భావిస్తున్నాను. ఇక బిఆర్ఎస్‌కు ఎక్కడ అవకాశం ఉంటుంది?” అని అన్నారు.

ఇప్పటివరకు టిడిపి, జనసేనలు ఎక్కడ చేతులు కలుపుతాయో, వాటి కలయికతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు ఎక్కడ మారిపోయి తమకు ఎసరు పెడతాయో అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ చాలా బెంగపెట్టుకొని నిత్యం చంద్రబాబు నాయుడుని, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరినీ తిడుతుండేవారు.

కానీ ఇప్పుడు అపర చాణక్యుడని పేరు మోసిన కేసీఆర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్ఎస్‌తో అడుగుపెట్టబోతున్నారు. అంటే వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఎదురీత మరింత ఎక్కువ అవుతుందన్న మాట! కేసీఆర్‌ ప్రధానంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కనుక ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ దయనీయ పరిస్థితి గురించి, అమరావతి, పోలవరం, సంక్షేమ పధకాల వలన పెరిగిన అప్పులు తదితర అంశాల గురించి మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ఖాయం. కనుక కేసీఆర్‌ను ఆయన వెనక వచ్చే అతిరధమహారధులను ఎదుర్కోవడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు సిద్దంగా ఉండకతప్పదు.