R Krishnaiahబీసీలు ప్రస్తుతం అనుభవిస్తున్న రిజర్వేషన్లు ముట్టుకోకుండా కాపులకు రిజర్వేషన్లు కలిపించిన బీసీ వర్గాలు ఆందోళనకు గురి అవుతున్నాయి. ఆర్. కృష్ణయ్య వంటి వారు వారిని ప్రేరేపించడంతో అక్కడక్కడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులూ తోడయ్యారు.

ఇప్పటిదాకా కాపులను రెచ్చగొట్టిన వీరు ఇప్పుడు బీసీలను రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొలిపే పనిలో ఉన్నారు. నిన్నటిదాకా కాపు ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న కాకినాడలో వైకాపా నాయకుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ నాయకత్వంలో బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. దీనిబట్టి సిద్ధాంతాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి అని క్లియర్ గా కనిపిస్తుంది.

మరోవైపు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యి పరిస్థితి పై సమీక్షించారు. ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యాలని వారికి చెప్పారు. కొన్ని పార్టీలు, నాయకులు రాజకీయ లబ్ధి కోసం కులాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

మరోవైపు కాపు ముఖ్యనాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు జాతికి కనీసం పది శాతమైనా రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్ చేసారు. ‘ఆకువేసి భోజనం పెడతారని ఆశిస్తే, టిఫిన్‌ మాత్రమే పెట్టారు’ అని ముద్రగడ వ్యాఖ్యానించారు. బిల్లును 9వ షెడ్యూల్‌లో పెట్టి కాపు జాతికిఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకున్నప్పుడే చంద్రబాబు మంచి ముఖ్యమంత్రిగా కాపుజాతిలో దృష్టిలో నిలిచిపోతారన్నారు.