YSRCP-Verbal-Attack-Nara-Lokeshగత ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేసిన ఐ-ప్యాక్ బృందం టిడిపిని రాజకీయంగా హత్య చేసిందనే చెప్పుకోవచ్చు. దాని వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లని లక్ష్యంగా చేసుకొని వారికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. నారా లోకేష్‌ శరీరాకృతి, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా.. ప్రతీ దాని గురించి ఓ పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తూ నారా లోకేష్‌ అసమర్దుడని ప్రజలని నమ్మించగలిగింది. దీనిలో సాక్షి మీడియా కూడా ఓ చెయ్యేసి సాయపడింది. ఒకప్పుడు నారా లోకేష్‌ టిడిపి కార్యకర్తలు, పార్టీలో తన పనేదో తనది అన్నట్లు చేసుకుపోతుండేవారు తప్ప ఏనాడూ మీడియా సమావేశాలు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నేతలనీ గానీ తిట్టిపోయలేదు. అందువల్ల ఆనాడు నారా లోకేష్‌ని పప్పు… తెలివిలేనివాడు… అసమర్దుడు అని గట్టిగా వాదిస్తూ ప్రజలని నమ్మించగలిగారు.

అనాడూ వైసీపీ నేతలు, ఐ-ప్యాక్ చేసిన దుష్ప్రచారంతో మరొకరైతే రాజకీయ సన్యాసం తీసుకొని దూరంగా పారిపోయి ఉండేవారు. కానీ నారా లోకేష్‌ వారి విమర్శలని సానుకూలంగా స్వీకరించి తనలో లోపాలని సవరించుకొని కొలిమిలో సుత్తిదెబ్బలు తిని పదును తేరిన కత్తిలా తనని తాను మార్చుకొన్నారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ సిఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలని లక్ష్యంగా చేసుకొని నిప్పులు చెరుగుతున్నారు. ఆయన భాష, యాస, మాటలలో పదును పెరిగాయి. ప్రజలని చూసి ఏదో ఒకటి మాట్లాడేయకుండా ఏ వర్గం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారికి సంబందించిన సమస్యలు లేదా అంశాల గురించి మాట్లాడుతూ ఆకట్టుకొంటున్నారు.

మాద్యమద్యలో “సిఎం జగన్‌ రెడ్డీ నువ్వు మూడున్నరేళ్ళలో ఏం చేశావంటే కేవలం నా చేతిలో మైక్ లాక్కోగలిగావు అంతే,” అంటూ నారా లోకేష్‌ వేసిన పంచ్ డైలాగ్ సోషల్ మీడియాలో భలే పేలింది.

“ఏపీకి పరిశ్రమలు తేవలసిన ఐ‌టి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి హైదరాబాద్‌ వెళ్ళి కోడి…గుడ్డూ.. పెట్టా… అంటూ కబుర్లు చెపుతున్నాడు…”, అంటూ నారా లోకేష్‌ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

నారా లోకేష్‌ మాటలలో ఇంత పదును, వెటకారం ఉంటుందని ఊహించలేకపోయిన వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు. అసలు ఆయన పాదయాత్రని పట్టించుకోమని చెప్పిన వైసీపీ నేతలే ఇప్పుడు మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నారు. ఒకప్పుడు నారా లోకేష్‌కి మాట్లాడటమే రాదని ఎగతాళి చేసినవారే నేడు “ఏమిటీ భాష… చిన్నా పెద్దా గౌరవం లేదా? సంస్కారం లేదా?అంటూ విరుచుకుపడుతున్నారు.

నారా లోకేష్‌ ఇంకా 17 రోజులలో కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 200 కిమీ పాదయాత్ర మాత్రమే పూర్తి చేశారు. ఇది ట్రైలర్‌ మాత్రమే అని నారా లోకేష్‌ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ మొదట వైసీపీ నేతలు ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడు వారికి బాగానే అర్దమైన్నట్లుంది. అందుకే ఒక్క నారా లోకేష్‌ని ఎదుర్కోవడానికి అందరూ హడావుడిగా మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. అయితే నారా లోకేష్‌ చెప్పిన్నట్లుగా ఇది 17 రోజుల ట్రైలర్‌ మాత్రమే… ఇంకా 383 రోజుల సినిమా ఉంది!

నారా లోకేష్‌ దూకుడు చూసి వైసీపీ నేతలు ఆయన తమ జిల్లా, నియోజకవర్గం దాటిపోతే చాలని దణ్ణం పెట్టుకొంటున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. తర్వాత నారా లోకేష్‌ తమ నియోజకవర్గంలో ఏం బాంబులు పేలుస్తారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్రతోనే నారా లోకేష్‌ వైసీపీ నేతలకి ముచ్చెమటలు పట్టిస్తుంటే శ్రీకాకుళం చేరుకొనేలోగా వారి పరిస్థితి ఏమవుతుంది?దీనికి రెండే పరిష్కారాలు కనిపిస్తున్నాయి. 1. పోలీసులతో ఆయన పాదయాత్రని అడ్డుకోకుండా సహకరించడం. 2. ముందస్తు ఎన్నికలకి వెళ్లిపోవడం!