YSRCP-Attack-TDP-MLA-AP-Assemblyపట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో ఆ అసహనం… కోపమే ఈరోజు శాసనసభలో మరో రూపంలో బయటపడ్డాయని టిడిపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయులు అన్నారు.

“ప్రతిపక్షాలను రోడ్లపైకి రానీయకుండా చేసి ప్రజలకు దూరం చేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్:1ను రద్దు చేయాలని డిమాండ్‌పై చేస్తూ శాసనసభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి మేము నిరసనలు తెలియజేస్తుంటే, సభలో ముందు వరుసలో కూడా మంత్రులు రాకుండా వెనక వరుసల్లో కూర్చోన్న ఇద్దరు దళిత వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా వచ్చి తనపై దాడి చేయడం చూస్తే ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిన దాడే అని అర్దమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిటో కంగుతిన్న వైసీపీ ప్రభుత్వం దానిపై నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్ళించేందుకే శాసనసభలో తమపై దాడి చేసి ఉండవచ్చు. కానీ మేమే స్పీకరుపై దాడి చేశామని వైసీపీ అబద్ధాలు చెపుతోంది.

మా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేతిలో నుంచి ప్లకార్డు పట్టుకొని నిరసన తెలియజేస్తుంటే మంత్రి కారుమూరు నాగేశ్వర రావు, మాజీ మంత్రి వెల్లంపల్లి ఇద్దరూ ఆయనపై దాడి చేసి పక్కకు తోసేయడంతో కిందన పడిపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కళ్లెదుట వైసీపీ సభ్యులు మాపై దాడి చేస్తుంటే ఆయన కూడా వారిని వారించలేదు. వైసీపీ సభ్యులకి దమ్ముంటే ఈరోజు శాసనసభ వీడియో ఫుటేజీని యదాతదంగా ఎడిట్ చేయకుండా మీడియాకు రిలీజ్‌ చేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలను సభలో టిడిపి సభ్యులపై దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదో బ్లాక్ డే,” అని డోల బాల వీరాంజనేయులు అన్నారు.

టిడిపి ఎమ్మెల్యే బెందళామ్ ఆశోక్ శాసనసభ బయట విలేఖరులతో మాట్లాడుతూ, “మేము జీవో నంబర్:1 రద్దు చేయాలని పోడియం వద్ద నిరసనలు తెలియజేస్తుంటే, వైసీపీ సభ్యులు మావద్దకు ఎందుకు వచ్చారు?వారికి పోడియం వద్ద ఏం పని? మాఫీ దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే కదా వచ్చింది?మాపై వైసీపీ సభ్యులు దాడి చేస్తే స్పీకర్ వారిపై చర్య తీసుకోకుండా మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు.