YSRCP-Ramoji-Raoవైసీపీ ప్రభుత్వం గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే సంక్షేమ పధకాలు, అప్పులు, అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ కక్ష సాధింపులు మాత్రమే కనిపిస్తాయి. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా లేదా వైఫల్యాల గురించి మాట్లాడినా ఇక వారిపై ఏదోవిదంగా కక్షసాధింపు చర్యలు మొదలైపోతాయి. అవి భరించలేకనే కోడెల ఆత్మహత్య చేసుకొంటే, ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీకి దూరంగా ఢిల్లీ పారిపోయి బ్రతుకుతున్నారు.

రాష్ట్రంలో మరే పత్రికకు లేనంత నెట్‌వర్క్ కలిగిన ‘ఈనాడు’ జగన్ ప్రభుత్వం వైఫల్యాలను, తప్పుడు నిర్ణయాలను, గాడి తప్పిన పాలన గురించి ఈనాడు మీడియా పూర్తి గణాంకాలు, సాక్ష్యాధారాలతో సహా ప్రచురించి, ప్రసారం చేస్తుంటుంది. కనుక వైస్ నేతలు ఈనాడుపై ‘ఎల్లో మీడియా’ అనే ముద్రవేసి అది పనిగట్టుకొని తమ ప్రభుత్వంపై బురద జల్లుతుంటుందని తమ సొంతబాకా పత్రిక సాక్షిలో ఎంతగా సమర్ధించుకొన్నప్పటికీ, ఈనాడు చూపుతున్న ఫోటో సాక్ష్యాధారాలను, గణాంకాలు ప్రజలని ఆలోచింపజేస్తున్నాయనే విషయం ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం గ్రహించినట్లే ఉంది.

కానీ తమ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారైన ఈనాడును లొంగదీయడానికి ప్రయత్నిస్తే దేశంలోని యావత్ మీడియా దృష్టిలో పడతామని గ్రహించి, రామోజీ గ్రూప్ సంస్థలలో ఒకటైన మార్గదర్శిపై సోమవారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారుల చేత దాడులు చేయించింది.

మార్గదర్శి సంస్థ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా తన ఖాతాదారుల నుంచి అక్రమంగా వేలకోట్లు ఫిక్స్ డిపాజిట్లు సేకరించిందని, అది హిందూ అవిభాజ్య చట్టం ప్రకారం అది నేరమని ఆరోపిస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ కేసు వేశారు. దానిలో జగన్ ప్రభుత్వం కూడా పిటిషన్‌ వేసింది. అయితే న్యాయస్థానంలో కేసులు త్వరగా తేలవు కనుక జగన్ ప్రభుత్వం మార్గదర్శిని దాంతో రామోజీరావును, ఈనాడు సంస్థను కట్టడిచేయాలని ప్రయత్నించినట్లు అర్దమవుతోంది. మార్గదర్శిపై రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అధికారులతో దాడులు చేయించడం ద్వారా ఖాతాదారులలో మార్గదర్శి సంస్థ పట్ల అపనమ్మకం కలిగించడమే కాకుండా అందరూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొనేలా చేయించాలనే దురాలోచన కూడా కనబడుతోంది.

అయితే రామోజీరావుని దెబ్బతీసి లొంగదీసుకోవడం అంత సులువే అయితే ఆయన ఇంతకాలం ఇన్ని వ్యాపారాలు చేయగలిగి ఉండేవారే కాదు కదా?