YSRCP Attack on Macherla TDP Brahma Reddyపల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. శుక్రవారం సాయంత్రం టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో మాచర్ల పట్టణంలో టిడిపి శ్రేణులు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?’ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో రింగ్ రోడ్ నుచి మునిసిపల్ కార్యాలయం వద్ద ఉన్న పాఠశాల వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ విషయం తెలుసుకొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని టిడిపి ర్యాలీని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దాంతో ఇరువర్గాల మద్య ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు కానీ వారిని అదుపు చేయడంలో విఫలం అయ్యారు. వైసీపీ శ్రేణులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ టిడిపి శ్రేణులు ర్యాలీని కొనసాగించి గమ్యస్థానం చేరుకొని అక్కడ కొంతసేపు ధర్నా చేశారు. తర్వాత అందరూ మళ్ళీ పార్టీ కార్యాలయానికి చేరుకొన్నారు.

కొంతసేపు తర్వాత అక్కడికి వైసీపీ కార్యకర్తలు కర్రలతో వచ్చి బ్రహ్మారెడ్డితో సహా అక్కడున్న టిడిపి కార్యకర్తలపై దాడులు చేశారు. దాంతో వారు కూడా ఆదేస్థాయిలో వారిని ప్రతిఘటించారు. వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉన్న వాహనాలపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి చేసి దానికీ నిప్పు పెట్టారు. శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ ఘర్షణలు సుమారు రెండు మూడు గంటలపాటు సాగాయి. అయినా పోలీసులు వారిని అదుపుచేయడంలో విఫలం అయ్యారు. చివరికి బ్రహ్మారెడ్డిని, టిడిపి కార్యకర్తలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

తాము కేవలం నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులే తమ అనుచరులతో వచ్చి తమపై కర్రలతో దాడులు చేశారని, కానీ అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోకుండా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. కానీ బ్రహ్మారెడ్డే టిడిపి శ్రేణులను రెచ్చగొట్టి కర్రలతో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టిడిపి దాడిలో తమ కార్యకర్తలు పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఆరోపిస్తున్నారు. ఇరువర్గాలు పరస్పరం పిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ఏదో ఓ పేరుతో నిరసనలు, ఆందోళనలు చేస్తుండటం సహజం. టిడిపి కూడా అదే చేస్తోంది. వాటిని వైసీపీ పట్టించుకోకపోతే వారు ప్రశాంతంగా ర్యాలీ చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ వారిని ముందుకు వెళ్ళకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం వలననే ఈ ఘర్షణలు మొదలయ్యాయని అర్దం అవుతోంది.

ఇక వైసీపీ ఆగ్రహానికి మరో బలమైన కారణం కనిపిస్తోంది. టిడిపి ఇప్పుడు తన నిరసన కార్యక్రమాలకి ప్రజల వాడుక భాషలోనే పేర్లు పెడుతుంటడంతో ప్రజలు సులువుగా వాటితో కనెక్ట్ అవుతున్నారు. ఉదాహరణకి ఇంతకు ముందు టిడిపి ‘బాదుడే బాదుడు’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?’ పేరు ఇంకా క్యాచీగా ఉండటంతో ఆ పేరుతో టిడిపి శ్రేణులు చేస్తున్న నిరసనలు, ర్యాలీలు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఈవిషయం వైసీపీ కాస్త ఆలస్యంగా గ్రహించినట్లుంది. అందుకే ఎక్కడికక్కడ టిడిపి ర్యాలీలని అడ్డుకొనేందుకు దాడులకి కూడా వెనకాడటం లేదు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా వైసీపీ దాడుల్లో తగులబడిన బ్రహ్మారెడ్డి ఇల్లు, కార్యాలయం, కార్లు కళ్లెదుటే ఉన్నాయి. మరి పోలీసులు దీనికి ఏం సమాధానం చెపుతారో?బ్రహ్మారెడ్డి ఇంటికి వాహనాలకి నిప్పు పెట్టిన దుండగులని అరెస్ట్ చేస్తారో లేదో?