YSRCP applause to sonia gandhi oath in Lok sabhaయూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కాసేపటి క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆవిడ ప్రమాణం చేస్తున్న సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ఆమె తన సీటు నుంచి వెల్‌ వద్దకు వస్తున్న సమయంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్‌ ఎంపీలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రఘురామ కృష్ణంరాజు (నరసాపురం), తలారి రంగయ్య (అనంతపురం)లు కూడా బల్లలపై చేతులు చరిచి అభినందనలు తెలిపారు.

సోనియాగాంధీకి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విరోధం ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి మరణానంతరం తనను ముఖ్యమంత్రి చెయ్యలేదని, తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని విభేదించి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచి కొత్త పార్టీ స్థాపించారు. ఆ తరువాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పతనానికి కారణం అయ్యారు. ఇప్పటివరకూ కూడా కాంగ్రెస్ కోలుకోలేదు. వరుసగా రెండు ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

ఆ తరువాతి కాలంలో రాష్ట్రవిభజన సమయంలో కూడా జగన్ కాంగ్రెస్ ను విమర్శించారు. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ విభజన సమస్యలకు కాంగ్రెస్ నే నిందిస్తున్నారు జగన్. కాంగ్రెస్ అప్పటి రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకపోవడం వల్లే అది రాలేదు అంటారు జగన్. ఈ తరుణంలో సోనియాగాంధీ ప్రమాణస్వీకారానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల ఆత్రం ఏంటో? మరోవైపు తన మాతృమూర్తి హిందీలో ప్రమాణం చేస్తుండగా రాహుల్‌గాంధీ మొబైల్‌ ఫోన్‌లో అపురూపంగా చిత్రీకరించారు.