ysrcp and janasena party leaders met Thota Narasimhamటీడీపీ కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆరోగ్యరీత్యా ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నా అని, తన సతీమణికి గానీ కుమారుడికి గానీ జగ్గంపేట అసెంబ్లీ సీటు ఇవ్వమని చంద్రబాబును కోరారు. అయితే జగ్గంపేటలో సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ఉండడంతో చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీనితో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనను తమ పార్టీలోని తీసుకుని రావడానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ఇటీవలే వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వీరవరంలో ఎంపీ తోట కుటుంబాన్ని కలిసి వెళ్లారు. తాజాగా తోట నరసింహం కుటుంబసభ్యులను జనసేన పార్టీ నాయకులు శనివారం కలుసుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ సన్నిహితుడైన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మదేవ్‌, రాష్ట్ర కోశాధికారి పంతం నానాజీ, తులసిరామ్‌ ఇంకా పలువురు జనసైనికులు ఎంపీ తోట కుటుంబసభ్యులను కలిశారు. తోట నరసింహం ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆయన కుటుంబసభ్యులు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఎమ్మెల్యే సీటు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ తోటకు తెలియజేశారు. దీనితో తోట నరసింహం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఉభయ గోదావరి జిల్లాలలో కాపుల ఓట్ల మీద జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది. అదే సామాజిక వర్గానికి చెందిన తోట నరసింహన్ని పార్టీలోనికి తీసుకువస్తే ఆ పార్టీలో తమ ఇమేజ్ పెరుగుతుందని జనసేన భావిస్తుంది. అందుకే ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.