ysrcp-ambati-rambabu-bribe-in-electionsఆవేశంలో ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు లోపల ఉన్న నిజాలను బయటకు తెచ్చేస్తుంటాయి. అలాంటి నిజాలనే వైసీపీ నేత అంబటి రాంబాబు బయటపెట్టారు. పెద్ద నోట్ల వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న నేపధ్యంలో… కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఉదంతంలో చంద్రబాబు హస్తం ఉంటే, దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతూ… వచ్చే ఎన్నికలలో అసలు డబ్బులు పంచబోమని చంద్రబాబు ప్రకటించగలరా? అంటూ వైసీపీ అసలు ఎందుకు చంద్రబాబును టార్గెట్ చేస్తుందో అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

అంబటి రాంబాబు గారి ఉద్దేశంలో… పెద్ద నోట్ల రద్దు అనేది ఎన్నికల్లో డబ్బులు పంచడానికి వీలు లేని చర్యగా భావిస్తున్నారని అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు డబ్బులు పంచుతారో లేదో అన్న విషయం పక్కన పెడితే… తాము మాత్రం ‘డబ్బులు పంచకుండా రాజకీయాలు చేయలేమని, ఎన్నికలలో పోటీ చేయలేమని’ వైసీపీ అధికార ప్రతినిధిగా అంబటి రాంబాబు చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు ఈ ఉదంతంపై జగన్ మౌనం వహించడం, జగన్ మీడియాలో మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కధనాలు ప్రసారం చేయడం వెనుక ఉద్దేశాన్ని అంబటి రాంబాబు గారు బయట పెట్టినట్లుగా కనపడుతోంది.

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో అంబటి లేవనెత్తిన ఈ యాంగిల్ ను ఇప్పటివరకు ఏ రాజకీయ నేత ప్రస్తావించలేదు. బహుశా ఇతర పార్టీలు కూడా ఇదే ఆలోచనలతో మోడీ నిర్ణయాన్ని విభేదిస్తున్నారో ఏమో గానీ, ఈ నిర్ణయం వలన సామాన్యులు కష్టాలు పడుతున్నారంటూ చెప్పే ఓదార్పు మాటలన్నీ ‘కాకమ్మ కబుర్లు’గా తేలిపోయింది. మొత్తానికి ‘ఓటుకు నోటు’ అన్న సిద్ధాంతాన్ని వైసీపీ అధికార ప్రతినిధిగా అంబటి రాంబాబు గారు కూడా పూర్తిగా బలపరిచినట్లు స్పష్టమైంది.