కోనసీమ జిల్లా పచ్చటి పంటలకే కాదు రాజకీయాలకు కూడా నిలయమే. అయితే వైసీపీకి ముందు… వచ్చిన తర్వాత అన్నట్లు రాజకీయాల తీరు మారింది. ఒకప్పుడు ఎన్నికల సమయంలోనే రాజకీయ హడావుడి కనిపించేది. కానీ ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. కోనసీమ అల్లర్లు వాటికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
కోనసీమ జిల్లాలో అమలాపురం మరీ ప్రత్యేకమైనది. దేశంలో అత్యధిక ఎస్సీ జనాభా ఉన్న మూడు నియోజకవర్గాలలో ఇదీ ఒకటి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలే.
మొదట్లో ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కంచుకోట పగిలిపోయింది. 2019 ఎన్నికలలో అమలాపురం లోక్‌భ సీటును వైసీపీ అభ్యర్ధి చింతా అనురాధ గెలుచుకొన్నారు. అప్పటి నుంచి ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచిపేరే సంపాదించుకొన్నారు కానీ ఈసారి ఎన్నికలలో ఆ సీటు ఆమెకి దక్కే అవకాశం లేదు!
అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకొన్న పినిపె విశ్వరూప్ అమలాపురంలో ఎంపీలైనా, ఎమ్మెల్యేలైన ఎవరైనా సరే తనకు విధేయంగా ఉండాలని కోరుకొంటున్నారు. కానీ చింతా అనురాధ అందుకు సిద్దంగా లేరు. దీంతో ఇద్దరి మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆమె మళ్ళీ అమలాపురం నుంచే పోటీ చేయాలని కోరుకొంటున్నప్పటికీ మంత్రి విశ్వరూప్ చక్రం తిప్పితే తనే నష్టపోతానని గ్రహించి ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నారు. అయితే ఆ సీటుని మళ్ళీ దక్కించుకోవడం కోసం కాదు పి. గన్నవరం (ఎస్సీ రిజర్వ్) శాసనసభ నియోజకవర్గానికి మారిపోయేందుకు!
కానీ అక్కడా ఆమెకు మరో ఇబ్బంది ఉంది. గత ఎన్నికలలో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్ధిగా కొండేటి చిట్టిబాబు పోటీ చేసి గెలిచారు. ఆయన కూడా నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి పట్టు సాధించారు. మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. కనుక ఆ సీటు కోసం చింతా అనురాధ పార్టీ అధిష్టానం వద్ద పైరవీలు చేసుకొంటున్నారు.
అమలాపురంలో మంత్రి విశ్వరూప్, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఉన్నారు. కనుక ఈ తొక్కుడు బిళ్ళ ఆటలో ఎవరు ఎవరిని తొక్కేస్తారో?తెలియాలంటే ఎన్నికల గంట మ్రోగాల్సి ఉంటుంది.