ysrcp-adimulapu-sureshఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల మాటలు చిత్రంగా ఉంటాయి. నిన్నటికి నిన్న రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని.. అందు వల్ల స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు వాదించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్థానిక ఎన్నికల కోసం పెట్టిన మీటింగుకు కూడా వారు హాజరు కాలేదు.

సరే కరోనా సెకండ్ వేవ్ అనేది నిజమే అనుకుందాం…. ఈరోజు నవంబర్ 2 నుండి స్కూళ్లు తెరవడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుందని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. కరోనా తగ్గింది కాబట్టి నవంబర్ 2 నుంచి స్కూళ్ళు తెరుస్తాం అని మంత్రి గారు చెప్పడం విశేషం. స్కూళ్ళు తెరవడానికి లేని ఇబ్బంది ఎన్నికలు నిర్వహించడానికి ఏంటో?

కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో పిల్లలు విఫలం కావొచ్చు. ఎన్నికలలో పాల్గొనేది మాత్రం 18 ఏళ్ళు పైబడిన వారే. పిల్లలు సేఫ్ అయినప్పుడు పెద్దలకు వచ్చిన ఇబ్బందేంటో? “కరోనా అనేది అసలు కారణమే కాదు. నిమ్మగడ్డ ఉండగా ప్రభుత్వం అరాచకాలకు తెగబడి ఏకగ్రీవాలు చేసుకోవడం కుదరదు. అందుకే స్థానిక ఎన్నికలు వద్దు అంటున్నారు,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.

స్థానిక ఎన్నికలు నిర్వహణ గురించి రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు మాత్రమే హాజరు కాలేదు. జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని ఈమెయిల్ ద్వారా తెలిపింది. ఎన్నికలు నిర్వహించే పక్షంలో తగిన భద్రతా చర్యలతో నిర్వహించాలని… ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల సంఘం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపింది. మిగిలిన పార్టీలు కూడా అదే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చాయి.