YSR - Kanti Veluguఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విషయమై ఉత్తర్వులు కూడా ఇచ్చారని రాష్ట్రప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. దీనికి వైఎస్ ఆర్ కంటివెలుగు అని పేరు పెట్టారు. వచ్చే నెల పదో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇందుకు సంబందించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వైఎస్సార్‌ కంటివెలుగు పథకం నిర్వహణకు 8 మందితో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పథకం నిర్వహిస్తున్నామని మంత్రులు ఘనంగా ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడో తకరారు ఉంది. ఈ పథకం చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉంది. అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల పేరిట నిర్వహించేది. 2018 జులై నాటికే 2.34 లక్షల మందికి కంటిపరీక్షలు చేసి, 2.01 లక్షల మందికి ఉచితంగా కళ్లజోళ్లు ఇచ్చారు. ఆ తరువాత ఇదే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా మొదలు పెట్టింది.

అదే పథకాన్ని ఇప్పుడు పేరు మార్చి సొంతం పథకం అన్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని టీడీపీ అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రుజువులతో సహా నిరూపించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు నీళ్లు నములుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ పథకానికి పెద్దగా ప్రచారం చెయ్యలేదు. దీనితో కొత్త పథకమని చెప్పినా ప్రజలను నమ్మించవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండడంతో రాష్ట్రప్రభుత్వం అభాసుపాలయ్యింది.