YSR-Jagan-YSRCP-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతి వలన ప్రజలలో ఏర్పడిన సానుభూతి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలతో ఆ పునాదిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్మించుకొన్నారు. ‘తాజ్‌ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన వారెందరో…’ అన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో విజయమ్మ, షర్మిల వంటివారు అనేకమంది కీలకపాత్ర పోషించారు.
ఆ తరువాత జగన్ పాదయాత్ర చేస్తూ అందరికీ కిస్సులు, హగ్గులు, బ్లెస్సింగులు ఇచ్చినందుకో లేక ఎక్కడి నుంచో నవరత్నాలు తెచ్చి పంచి పెడతానని చెప్పినందుకో తెలీదు గానీ అక్రమాస్తుల కేసులలో 16 నెలలు జైలులో గడిపివచ్చారని కూడా చూడకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయనకు ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చారు. నవరత్నాలతో పాటు వాతలు, మోతలు, కత్తిరింపులు వేస్తున్నా మౌనంగా భరిస్తున్నారు అది వేరే సంగతి.

కానీ మూడేళ్ళలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లిని పార్టీలో నుంచి బయటకు పంపించేసారు. ప్లీనరీకి ముందు ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించినప్పటికీ, ఇక ఆయన పేరు, ఫోటో కూడా అవసరం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్ మాట్లాడే ప్రతీ వాఖ్యంలో తండ్రిపేరు పదేపదే ప్రస్తావించేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన బాగా తగ్గడం అందరూ గమనించే ఉంటారు.

సంక్షేమ పధకాలలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన క్రమంగా తగ్గుతోంది. వచ్చే ఎన్నికలలో తన ఫోటోతోనే 175 సీట్లు గెలుచుకొంటుందని జగన్ ధైర్యంగా చెప్పుకొంటున్నారు కూడా. అంటే సిఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి నీడలో నుంచి కూడా బయటపడి సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు.

మంచిదే. కానీ ఏ పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్మించుకొన్నారో ఇప్పుడు ఆ పునాదుల అవసరం లేదనుకొంటే ఏమవుతుంది? చెల్లిని, తల్లిని బయటకు పంపించేసి ఇప్పుడు తండ్రిని కూడా వద్దనుకొంటే ప్రజలు ఏమనుకొంటారు? బలమైన తండ్రి సెంటిమెంటును వదిలేసుకొని సంక్షేమ పధకాలను నమ్ముకొని ముందుకు వెళితే వచ్చే ఎన్నికలలో పరిస్థితులు తారుమారు అయితే?అని వైఎస్సార్ కాంగ్రెస్‌ నేతలలో ఆందోళన మొదలయ్యింది. కానీ జగనన్నను కాదనలేరు. బయటకు వెళ్ళలేరు. ఎందుకంటే వారందరూ పులి మీద సవారీ చేస్తున్నారు కనుక. పులి మీద కూర్చొన్నా ప్రమాదమే… దిగినా ప్రమాదమే కదా!