‘గాల్లో వస్తాడు, గాల్లోనే పోతాడు’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో వైఎస్సార్ మరణం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్ మరణం వెనుక చంద్రబాబు హస్తం హస్తం ఉందంటూ వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

అయితే రాజకీయంగా డౌన్ అయిన ప్రతిసారి ‘వైఎస్సార్’ సంఘటనను వెలుగులోకి తీసుకురావడం అనేది ‘వైసీపీ అండ్ కో’కు పరిపాటి మారిపోయిందన్నది రాజకీయ పరిశీలకుల మాట. జగన్ ప్రతిపక్షంలో కూడా ఉన్న సమయంలో ఇలాగే వైఎస్సార్ సంఘటనకు – చంద్రబాబుకు లింకులు పెట్టి ప్రచారం చేసాయి.

ఆనాడు ‘జగన్ అండ్ కో’ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం తిప్పికొడుతూ, వైఎస్సార్ మరణించిన తర్వాత సీఎం సీటు కోసం ఎవరు ఆరాటపడ్డారో గుర్తు తెచ్చుకోవాలని వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి రాజకీయ విమర్శలు ఇరు పార్టీల నుండి రావడం సర్వసహజం కానీ, రాజకీయంగా ‘వైఎస్సార్’ పేరును వినియోగించుకోవడం మాత్రం ఆమోదయోగ్యం కానిది.

అధికారం చేపట్టి రెండున్నర్రేళ్ళు గడిచినా, ఏనాడూ వైఎస్సార్ మరణం గురించి వైసీపీ ప్రస్తావించలేదు. కానీ గడిచిన కొన్ని నెలలుగా అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తుండడం, దానికి తోడు వరదలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపడంతో, ప్రజల్లో వైఎస్సార్ కున్న ఇమేజ్ ను గుర్తు చేసి రాజకీయ లబ్ది పొందే ప్రక్రియలో భాగంగా ఈ విష ప్రచారం అని టిడిపి వర్గాలు చెప్తున్నాయి.