YSR Congress - YS Jagan Politicsపెద్దోళ్ళు సామెతలు ఊరకనే పెట్టరంటారు. అందులో ఓ సామెతను జగన్ మీడియా తూచ తప్పకుండా అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది. మొన్నటి వరకు చంద్రబాబు నామస్మరణే చేసిన జగన్ మీడియాకు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘నారా లోకేష్’ రూపంలో మరొకరు ‘ఆహారం’గా దొరికినట్లయ్యింది. చంద్రబాబు తనయుడే కావడంతో తండ్రితో పాటు కొడుకును కూడా లక్ష్యంగా చేసుకుని యధావిధిగా విమర్శలు గుప్పించడం జగన్ ను సమర్ధించే మీడియా వర్గీయుల వంతవుతోంది.

రాజకీయాల్లో విమర్శలన్నవి సర్వసహజం. కానీ, జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ విమర్శలు కాస్త ‘పగ – ప్రతీకారాలు’గా మారిపోయాయి. సిద్ధాంత పరమైన విమర్శలు పోయి, వ్యక్తిగతమైన విమర్శలు వెల్లువలా వినపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో నారా లోకేష్ మాట్లాడుతున్న ప్రతి మాటపై విమర్శలు చేయడం జగన్ మీడియా వంతవుతోంది. అయితే నిజంగా ఏదైనా ‘విషయం’ ఉండి విమర్శలు గుప్పిస్తే… ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా ‘కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న’ మాదిరి విమర్శలు చేస్తే చివరికి అబాసుపాలయ్యేది వారేనన్న విషయం గుర్తించకపోవడం జగన్ వర్గపు మీడియా స్పెషాలిటీ!

అంబేద్కర్ జయంతిని పొరపాటుగా వర్ధంతి అని లోకేష్ పలికినపుడు చేసిన విమర్శలు అందరూ హర్షించారు. జయంతి – వర్ధంతికి ఉన్న వ్యత్యాసం పూర్తి విభిన్నం కాబట్టి, అందులో లోకేష్ ను విమర్శించడంలో తప్పులేదు. అయితే లోకేష్ మాట్లాడిన ప్రతి సారి, అందులో ఏదొకటి హైలైట్ చేసుకుని తన మీడియాలలో పుంకాలు పుంకాలుగా కధనాలు రాయడం మాత్రం షరామామూలైపోతోంది. తాజాగా అనంతపురంలో నారా లోకేష్ మాట్లాడిన అసెంబ్లీ స్థానాల విషయాలను తప్పు పడుతూ జగన్ మీడియా, మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది.

రాబోయే ఎన్నికలలో 200 స్థానాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి, అఖండ విజయాన్ని అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. అయితే దీనిని హైలైట్ చేస్తూ… 175 స్థానాలు ఉన్న ఏపీలో 200 సీట్లు ఎలా గెలుస్తారో అంటూ అవహేళన చేయడం ప్రారంభించారు. అయితే ఏపీ, తెలంగాణాలకు సంబంధించి అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదనలో ఉందన్న కనీస విషయం జగన్ మీడియాకు తెలియకపోవడం నిజంగా జర్నలిజానికే మచ్చ తెచ్చే అంశం. ఈ ప్రతిపాదనలో ఏపీ అసెంబ్లీ సంఖ్య 225కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

అందులో భాగంగానే లోకేష్ 200 స్థానాలను గెలిపించమని కోరితే, దానిని తమకు అనుకూలంగా మలుచుకుని, లోకేష్ కు కనీస అవగాహన కూడా లేదంటూ కధనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఇక్కడ కనీస అవగాహన లేనిది నారా లోకేష్ కా? జగన్ మీడియాకా? అన్నది వారే నిర్దేశించుకోవాలి. టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్లుగా అక్రమ సంపాదనతో మీడియాను స్థాపించిన వారికి ఇలాంటి సక్రమ పద్ధతులు ఎలా తెలుస్తాయి? అని ప్రజలు అనుకునే విధంగా జగన్ మీడియా వ్యవహరిస్తుండడం శోచనీయం.