YSR-Congress-MLAs-To-Resign-for-Special-Statusఆంధ్రప్రదేశ్ లో విభజన నాటి పరిస్థితులు నెలకొంటున్నాయి. నాడు కాంగ్రెస్ పై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఊగిపోయారో, నేడు బిజెపిపై కూడా దాదాపుగా అలాంటి భావనే ఉందన్నది వాస్తవం. దీన్ని ముందుగానే గమనించిన తెలుగుదేశం ప్రభుత్వం మోడీతో తెగతెంపులు చేసుకోగా, బిజెపితో మైత్రీ కోసం వేచిచూస్తోన్న ప్రతిపక్ష పార్టీ దీనిని ఒడిసి పట్టుకుంది, అయితే బహిరంగంగా కాదు, లోపాయికారీ ఒప్పందంలో భాగమని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ‘జనసేన’ అదనపు హంగులు అనుకోండి, అది వేరే విషయం!

నాడు కాంగ్రెస్ నుండి బిజెపిలోకి జంప్ చేసిన పలువురు కీలక నేతలు, ప్రస్తుతం వైసీపీలోకి చేరబోతున్నారన్నది తెలిసిందే. నేడో, రేపో లాంచనంగా ‘ఫ్యాన్’ పట్టుకోవడానికి కొందరు కీలక నేతలు ఊవ్విళ్ళూరుతున్నారు. అయితే ఈ పరిస్థితి వైసీపీకేం కొత్త కాదు. నాడు కాంగ్రెస్ తో ఏర్పరచుకున్న లోపాయికారీ ఒప్పందంతో, కాంగ్రెస్ నుండి ఇలాగే నాయకులను దిగుమతి చేసుకున్న వైనం ఏపీ జనాలకు తెలిసిందే. కాలం మారినా వైసీపీ ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదన్న విధంగా, ప్రస్తుతం బిజెపి నుండి పలువురు నేతలను దిగుమతి చేసుకుంటోంది.

అయినా ఏ పార్టీలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు గనుకనే, ఈ అంశంలో బిజెపి కూడా గమ్ముగా ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కవన్న విషయం ‘మోడీ అండ్ కో’కు తెలియనిది కాదు. ఇంతకుముందు టిడిపితో కలిసి పోటీ చేయడం అనేది కలిసి వచ్చింది గానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో, వైసీపీలోకి వెళ్ళడం వలన భవిష్యత్తులో పెద్దగా నష్టమీమి జరుగదు గనుక, అటు పార్టీ పెద్దలు గానీ, ఇటు నిత్యం టిడిపిపై విరుచుకుపడే సోము వీర్రాజు వంటి రాష్ట్ర నేతలు గానీ ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు.