Jagan's-Conspicious-Missing-from-Election-Campaignఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. చివరి నిముషంలో రకరకాల పథకాల పేరిట చంద్రబాబు ఇస్తున్న తాయిలాలు ఆ పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనితో ఎలాగైనా వాటిని ఆపాలనే ప్రయత్నంలో ప్రజల ముందు విలన్లు అవుతున్నారు. ఇప్పటికే వీటిపై వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. తాజాగా ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ వేయించారు.

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దానిని కోర్టు సమర్ధించింది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పథకాలపై ఢిల్లీలో కంప్లయింట్ ఏంటి అంటూ అక్షింతలు వేసింది. పసుపు కుంకుమ చెక్కులు చెల్లవని కూడా ఆ పార్టీ గ్రామాలలో ప్రచారం చేసింది. 5,6,7 తారీఖులలో బ్యాంకు సెలవులు కావడంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆలా చెక్కులు ఇచ్చిందని ప్రచారం చేసారు.

అయితే సోమవారం చివరి చెక్కు మారే వరకు బ్యాంకులు తెరిచి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనితో ప్రభుత్వ పథకాలు చూసి ఓర్వలేకపోతున్నారని, తమను అయోమయానికి గురి చేసి డబ్బు పోగొట్టాలని చూస్తున్నారని ప్రజలలోకి మెస్సేజ్ బలంగా వెళ్ళింది. గ్రామాలలో దీనిపై విరివిగా చర్చ జరుగుతుంది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతిబంధకంగా మారొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులు తమని ఆశీర్వదిస్తే 2014 కంటే బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.