Ravi Prakashటీవీ9 కొత్త యాజమాన్యం, సీఈఓ రవిప్రకాశ్ మధ్య జరుగుతున్న గొడవ గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణలోని తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కొంత మంది వాణిజ్యవేత్తలు టీవీ9ను చేజిక్కించున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో టీవీ9 కొత్త యాజమాన్యం తరపున నిలబడడి ఈ విషయంలో రవిప్రకాశ్ ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్. తెరాస మిత్రుడు తనకూ మిత్రుడే అని భావించి గతంలో టీవీ9పై చేసిన విమర్శలకు రవిప్రకాశ్ దోషి అన్నట్టు చూపించే ప్రయత్నం.

రవిప్రకాశ్ ను బద్నామ్ చెయ్యడానికి ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో నెంబర్ 2 విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. రవిప్రకాశ్ ను విమర్శించడానికి ఆయన తన క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఏకంగా ఆయనకు ఎర్ర చందనం స్మగ్లరుకు లింకు పెట్టేయడం విశేషం. “ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవిప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి. ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు,” అంటూ ఆరోపించారు విజయసాయి రెడ్డి.

ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయం టీవీ9 కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాష్‌ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా.. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ పక్కకు గెంటేశారు. రవిప్రకాశ్ మీద నిన్నటి నుండి వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తూ టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్‌ ప్రతినిధులు ఉన్నప్పటికీ… కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్‌ చేశారంటూ సాక్షి లైవ్ లో బాధ పడటం విశేషం.