YSR-Congress-Roja---Nagari2014లో రోజా వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఎమ్మెల్యే ఐన ఆనందంలో ఆమె చెలరేగిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ వాణి గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఒక సమయంలో హద్దు దాటి తన క్రమశిక్షణా రాహిత్యంతో శాసనసభలో ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. రోజా నోటి దురుసు వల్ల టీడీపీ నాయకులు గానీ, అభిమానులను గానీ ఆమెను బద్ద శత్రువులానే చూస్తారు. దీనితో ఈ సారి ఎలాగైనా ఆమెను ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

2014లో రోజాపై పోటీ చేసి ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆ తరువాత కాలం చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు భానుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే టికెట్ నాకంటే నాకు అని గాలి ఇద్దరు బిడ్డలు కొట్టుకున్నారు. మొత్తానికి టికెట్ భానును వరించింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే గాలి సతీమణి సపోర్టు మరో కొడుకు జగదీశ్ కు ఉంది. దీనితో కుటుంబ సభ్యులలోనే ఐకమత్యం లేకపోతే ప్రజలలో సింపతీ ఎలా వర్క్ అవుట్ అవుతుందనేది ఇంకో ప్రశ్న.

అదే సమయంలో రోజా మీద నియోజకవర్గంలో వ్యతిరేకత బానే ఉందట. ఎమ్మెల్యేగా ఆమె చేసింది ఏమీ లేదని అక్కడి ప్రజల అభిప్రాయం. ప్రజావ్యతిరేకత ఉన్నా బలమైన ప్రత్యర్థి లేకపోవడం తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని రోజా భావిస్తున్నారు. రోజా భర్త కులస్థులు ఎక్కువ ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. ఈ సారి నన్ను గెలిపించండి, జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యి నియోజకవర్గం రూపు రేఖలు మార్చేస్తా అంటూ ప్రచారం చేస్తున్నారు రోజా. చూడాలి ఏమవుతుందో ఈ సారి.