వైఎస్సార్ కాంగ్రెస్ లో రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు రగిల్చిన చిచ్చు ఇప్పటికీ మండుతూనే ఉంది. అధికార పార్టీ నేతలు ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు… ఆయనేమో ఏకంగా పార్టీనే రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాడని వదంతులు వ్యాపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. చాలా కాలం నుండి రఘురామ కృష్ణం రాజు వైఎస్సార్ కాంగ్రెస్ లో చీలిక తెచ్చే అవకాశం ఉందని పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు అది నిజం అనిపించేలా ఒక సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మాజీ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే.. రామనారాయణ రెడ్డితో ఆయన తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

గత కొంత కాలంగా ఆనం అధిష్టానం మీద అలక బూనారు. బహిరంగంగానే అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన కూడా రఘురామ కృష్ణం రాజుతో కలిసి పార్టీని వీడుతారా అనే చర్చ జరుగుతుంది. ఆయనే కాకుండా రఘురామ కృష్ణం రాజు మరికొందరు నేతలతో చర్చలు జరుపుతున్నారా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే కొందరు మంత్రులు రాజ్యసభకు వెళ్లడంతో కాబినెట్ లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను ముఖ్యమంత్రి జగన్ త్వరలో పూరుస్తారు. అప్పుడు కొంతమంది అసంతృప్తులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.