ysr congress Rayalaseema Garjana in kurnoolనేడు వైసీపీ అధ్వర్యంలో కర్నూలులో రాయలసీమ గర్జన సభ జరుగుతోంది. ఈ సమావేశానికి సీమా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ హాజరయ్యి రాయలసీమకి చంద్రబాబు నాయుడు చాలా అన్యాయం చేశారని, తాము కర్నూలుని న్యాయరాజధానిగా చేయాలనుకొంటే మళ్ళీ అడ్డుపడుతున్నారంటూ పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆరు దశాబ్ధాలుగా రాయలసీమకి అన్యాయం జరుగుతుంటే, తొలిసారిగా సిఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయబోతే దానికీ చంద్రబాబు నాయుడు అడ్డుతగులుతున్నారని, కనుక రాయలసీమకి అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుని, టిడిపిని తరిమి కొట్టాలని మంత్రులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఈ మూడున్నరేళ్ళలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కొత్తగా చేసిందేమీ లేదు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఉన్న పరిశ్రమలే మూసుకొని పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ విదానాల కారణంగా పాడి, ఆక్వా పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో రాయలసీమ జిల్లాలలోని యువత ఉద్యోగాలు, ఉపాది కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు వలసలుపోతున్నారు. కానీ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తే చాలు… రాయలసీమ అభివృద్ధి చెందిపోతుందన్నట్లు మంత్రులు ప్రజలని మభ్యపెడుతున్నారు! హైకోర్టు ఏర్పాటు చేస్తే సీమ జిల్లాలలో యువతకి ఉద్యోగాలు లభిస్తాయా?అంటే కాదనే అర్దమవుతోంది.

అంతే కాదు… హైకోర్టు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇటు ప్రజలను, అటు సుప్రీంకోర్టుని కూడా మభ్యపెడుతోంది. ఇటీవల సుప్రీంకోర్టులో రాజధాని కేసు విచారణ సందర్భంగా “ఏపీ హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ‘అమరావతిలోనే’ అని అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ కర్నూలులో ఏర్పాటు చేస్తామని మంత్రులు సీమ ప్రజలకి చెపుతున్నారిప్పుడు!

అయితే వైసీపీ ప్రభుత్వం సీమా ప్రజలని ఎందుకు మభ్యపెడుతోంది?అంటే నేడు గర్జన సభలో మంత్రుల మాట్లాడుతున్న మాటలలోనే ‘అసలు విషయం’ అర్దం అవుతోంది. సీమకి చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారంటూ వారిని రెచ్చగొట్టి వారు టిడిపిని వ్యతిరేకించేలా చేసి వైసీపీకి అనుకూలంగా మార్చుకొని ఓట్లు వేయించుకోవడం కోసమే!

ఇటీవల చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించినప్పుడు అక్కడే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు కూడా. అమరావతి రాజధానిగా ఉంటుందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకొందామని చెప్పారు. దీనికే వైసీపీ ‘న్యాయ రాజధాని’ ఓ టైటిల్‌ తగిలించి సీమ ప్రజలని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పేరుతో సీమ ప్రజలు, ‘విశాఖ రాజధాని’ పేరుతో ఉత్తరాంద్ర ప్రజలను రెచ్చగొడుతూ వచ్చే ఎన్నికలలో టిడిపిని దెబ్బతీయాలనేది వైసీపీ దురాలోచనగా కనబడుతోంది.

ఇప్పటికే రాష్ట్రావిభజనతో ఓసారి విడిపోయిన తెలుగు ప్రజలను ఇప్పుడు ఈ మూడు రాజధానుల పేరుతో మరోసారి విడదీసేందుకు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే ప్రయత్నిస్తుండటం చాలా దారుణం. తిరిగి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుండటం అతి తెలివి ప్రదర్శించడమే కదా?

అయితే మూడున్నరేళ్ళుగా వైసీపీ పాలన ఎంత గొప్పగా సాగుతోందో చూస్తున్న ఏపీ ప్రజలకు వైసీపీ దురాలోచనలను పసిగట్టలేరనుకోవడం అవివేకమే. ఒకవేళ ఏపీ ప్రజలు నిజంగా అంత రాజకీయ ఆజ్ఞానులే అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన భూటకపు సమైఖ్యాంద్ర ఉద్యమాలు, భూటక ప్రత్యేకహోదా ఉద్యమాలు చేసిన మొదట ఆయనకే అవకాశం ఇచ్చి ఉండేవారు కదా? ప్రజలను రాజకీయ ఆజ్ఞానులనుకొని ఇటువంటి ఆలోచనలు చేసిన ఏ పార్టీ మనుగడ సాగించలేదని వైసీపీ గ్రహిస్తే మంచిది.