YSR Congress warning to BJPఇటీవలే జరిగిన ఎన్నికలలో సాధించిన ఘనవిజయం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులలో కిక్ ఇచ్చినట్టుగా ఉంది. వారి మాటలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ఒకపక్క ముఖ్యమంత్రి కేంద్రం వద్ద పొందికగా ఉంటుంటే కింద స్థాయి నాయకులు మాత్రం తొడలు కొడుతున్నారు. ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలో బీజేపీ ఎలా శివసేన ను ఖంగుతినిపించి ప్రభుత్వం ఫామ్ చేసిందో డిస్కస్ చేస్తున్నారు. ఎప్పటిలానే రాష్ట్ర బీజేపీ నాయకులు జబ్బలు చరుస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా భవిష్యత్తు మాదే అంటూ ప్రకటనలు చెయ్యడం తో, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్ కేంద్రానికే వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

“బీజేపీ వారు ఏ రాష్ట్రంలోనైనా చేసుకోండి. ఎలాంటి రాజకీయమైన చేసుకోండి. మా దగ్గర కాదు. ఇక్కడ జగన్ నాయకత్వం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది. మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బీ కేర్ ఫుల్ అంతే. ఈ రాజకీయాలు మాతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీ కూసాలే కదులుతాయి,” అంటూ రాజశేఖర్ హెచ్చరించారు.

అయితే అంతటి శక్తి సామర్ధ్యాలు కలిగిన ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తడం లేదో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేంద్ర సాయం శూన్యం. పోలవరం నిధులు కూడా ఏవో వంకలు పెట్టి ఆపేసినా కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు.