YS-Jagan Mohan Reddy- President Electionsవైసీపీ ప్రభుత్వానికి కావలసింది కేంద్రం నుంచి నిధులు, అప్పులే. కనుక త్వరలో జరుగబోయే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలో అదనంగా మరికొంత పిండుకొనే అవకాశం లభించినట్లే. జూలై 25వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇటీవల మరికొంత బలం పెరిగినప్పటికీ, తమ అభ్యర్ధిని రాష్ట్రపతిగా గెలిపించుకోవడానికి వైసీపీ, టిఆర్ఎస్‌, జెడియు (ఒడిశా) వంటి ప్రాంతీయ పార్టీలలో ఏదో ఒక్క పార్టీదైనా మద్దతు అవసరం ఉంది.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇప్పటికే కేంద్రంపై యుద్ధం ప్రకటించారు కనుక ఆయన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇవ్వకపోవచ్చు. జెడియు మద్దతు ఇస్తుంది కానీ ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌ను ప్రాధేయపడవలసి ఉంటుంది. కనుక నిధుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ‘ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్‌’గా కనిపిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆధారంగా జరుగుతుంది. వైసీపీకి పార్లమెంటు ఉభయసభలలో కలిపి మొత్తం 28 మంది ఎంపీలున్నారు. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో జనాభా కాస్త ఎక్కువ కనుక వారి ఓటు విలువ కూడా మరికాస్త ఎక్కువే ఉంటుంది.

కనుక మోడీ ప్రభుత్వానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంది. సిఎం జగన్మోహన్ రెడ్డికి నిధులు, అప్పులు కావాలి. ఈ బేరం అటు కేంద్రానికి, ఇటు వైసీపీ ప్రభుత్వానికి కూడా లాభసాటిగానే ఉంది కనుక రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఈయడం తధ్యం. అయితే దీంతో రాష్ట్రానికి అదనంగా ఎన్ని నిధులు, అప్పులు రాబట్టుకొంటారో రాబోయే నెలరోజుల్లోనే తెలుస్తుంది.

కానీ ఎన్ని వేలకోట్లు నిధులు, అప్పులు వస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఏట్లో పిసికిన చింతపండులా వచ్చిన డబ్బు వచ్చినట్లే మళ్ళీ అప్పులు, వడ్డీలకు, సంక్షేమ పధకాలకే ఖర్చయిపోతుంటుంది. నెల తిరిగేసరికి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళక తప్పడం లేదు. కానీ నెలనెలా రాష్ట్రపతి ఎన్నికలు జరుగవు కదా?కనుక వైసీపీ ప్రభుత్వానికి అప్పుల తిప్పలు తప్పవు. అయితే అది స్వయంకృతాపరాధమే కనుక ఆనందంగా అనుభవించకా తప్పదు.