Nara-Lokesh-Successనడిరోడ్డు మీద నరికేయండి… కాల్చి చంపండి… ఉరేయండి… చెప్పులతో కొట్టండి..! ఇవన్నీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో చేసిన వ్యాఖ్యలన్నీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక వైసీపీలో మంత్రిగా విధులు నిర్వహిస్తున్న కొడాలి నానికి అయితే ఏకంగా “బూతుల మంత్రి” అని ఏపీ ప్రజలు కితాబు ఇచ్చేసారు. అలాగే ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక పేర్ని నాని, ఒక విజయసాయి రెడ్డి… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పాఠకుల సహనానికి పరీక్షలు పెడుతుంది.

అయితే వీళ్ళతో పాటు రోజా వంటి వారు కూడా ప్రస్తుతం నారా లోకేష్ భాషపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ‘కధలోని అసలు కొసమెరుపు.’ మరి అంత చేటుగా లోకేష్ ఎన్ని బూతులు తిట్టారో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ‘మరో రెండేళ్లు మాత్రమే వైసీపీ నేతలు అధికారంలో ఉంటారు, ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత… తాను మా నాన్న చంద్రబాబు అంత మంచోడిని అయితే కాదని’ ఒక రకమైన బలమైన హెచ్చరికలను పంపారు. అలాగే వైసీపీ వర్గాలకు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఈ వ్యాఖ్యలతో వైసీపీకి ప్రత్యక్షంగా వచ్చే కష్టనష్టాలు ఏమీ ఉండవు గానీ, తెలుగుదేశం కార్యకర్తలలో మాత్రం నూతన ఉత్సాహాన్ని నింపడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారు. ఇదే వైసీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. దీంతో నారా లోకేష్ వాడుతున్న పదజాలం సరిగా లేదంటూ మీడియా వేదికలుగా గొంతెత్తుతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే… ఇంతకంటే అధ్వాన్నమైన భాషను వినియోగించే ప్రముఖ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా లోకేష్ భాషపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం!